Womens Safety: మహిళల భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి..!
నేరస్థుల డేటాబేస్ ను డిజిటైలైజ్ చేయడంతోపాటు, డిజిటల్ న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు తెలిపారు.
- By Gopichand Published Date - 08:30 PM, Tue - 19 August 25

Womens Safety: ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుసహా 8 నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద మహిళల భద్రత (Womens Safety) కోసం పలు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద ఆయా రాష్ట్రాల్లో 33 వేల సీసీటీవీల ఏర్పాటుతోపాటు పింక్ టాయిలెట్లు, మహిళా పెట్రోల్ యూనిట్లు, కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం నిర్భయ నిధి కింద రూ.2,840 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మార్చ్ నాటికి ఆయా సౌకర్యాలన్నింటినీ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఈరోజు న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో మహిళా భద్రతా విభాగం (Women Safety Division) అధికారులతో సమావేశమయ్యారు. క్రిమినల్ న్యాయవ్యవస్థలోని అన్ని ప్రధాన విభాగాలను (పోలీస్, జైలు, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్, కోర్టులు) ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చి సమగ్ర సమాచార మార్పిడి జరగడానికి రూపొందించిన సమగ్ర వ్యవస్థ ఇంటర్-ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ICJS) 2.0 తోపాటు, ఫోరెన్సిక్ సామర్థ్యాల ఆధునికీకరణ (SMFC/MoFC), నేషనల్ ఫోరెన్సిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎన్ హాన్స్‌మెంట్ స్కీమ్ (NFIES), జైళ్ల ఆధునికీకరణ (MoP), సేఫ్ సిటీ ప్రాజెక్టులు, “మహిళల భద్రత” కింద అంబ్రెల్లా స్కీమ్, మహిళా సహాయక డెస్క్‌లు (WHDs), ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ERSS) వ్యవస్థల పనీతీరు, కార్యక్రమాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు, సాధించిన విజయాలను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా మహిళల భద్రత, సురక్షిత వాతావరణం కోసం అమలు చేస్తున్న పథకాలను, రూపొందించిన ప్రణాళికలను వివరిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
మహిళా భద్రత చర్యల్లో భాగంగా మెట్రో నగరాల్లో CCTVలు, పింక్ టాయిలెట్లు, కౌన్సెలింగ్ సెంటర్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళల కోసం అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ (ERSS)లను ఏర్పాటు చేయడంతోపాటు ఏఐ, వాట్సాప్, చాటా బాట్ మొదలైన మల్టీ చానల్ సపోర్టు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా జాతీయ అత్యవసర నంబర్ – “112” ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. జైలు సంస్కరణల్లో భాగంగా హై సెక్యూరిటీ జైళ్ల నిర్మాణంతోపాటు పేద ఖైదీలకు సహాయ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. హై-సెక్యూరిటీ జైళ్ల నిర్మాణం కసం కేంద్రం రూ.950 కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. సీసీటీవీలు, జామర్లు, స్కానర్లు వంటి అధునాతన సాంకేతికత సౌకర్యాలను ఆయా జైళ్లకు కల్పించడంతోపాటు పేద ఖైదీల సంక్షేమ పథకం కింద ఏటా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.
Also Read: Shreyas Iyer: బీసీసీఐపై టీమిండియా ఫ్యాన్స్ గుర్రు.. కారణమిదే?
దేశంలోని అన్ని జిల్లాల్లోనూ మానవ అక్రమ రవాణా నిరోధించేందుకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం బంగ్లాదేశ్, యూఏఈ, కంబోడియా, మయన్మార్‌సహా పలు దేశాలతో అంతర్జాతీయంగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళల రక్షణ, సాయం కోసం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. యాసిడ్ అటాక్ బాధితులకు రూ.1 లక్ష ప్రత్యేక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం కేంద్రం రూ.200 కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 14,653 పోలీస్ స్టేషన్లలో మహిళా సహాయక డెస్క్‌లను ఏర్పాటు చేశామని, దాదాపు 13,006 మహిళా అధికారిణులు ఈ సహాయ డెస్క్ లను నడిపిస్తున్నట్లు వివరించారు.
ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుసహా 8 నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద పలు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 33 వేల సీసీటీవీల ఏర్పాటుతోపాటు పింక్ టాయిలెట్లు, మహిళా పెట్రోల్ యూనిట్లు, కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అందుకోసం నిర్భయ నిధి కింద రూ.2,840 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చ్ నాటికి ఆయా సౌకర్యాలన్నింటినీ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక సురక్షా సంహిత-2023, భారతీయ సాక్ష్య అధినియమ్-2023 వంటి కొత్త క్రిమినల్ చట్టాల అమలు స్థితిపైనా కేంద్ర మంత్రి బండి సంజయ్ సమగ్రంగా సమీక్షించారు. ఇప్పటివరకు సాధించిన పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృత చర్చ జరిగింది. కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు సంబంధించి 18 రాష్ట్రాల్లో శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఆయా రాష్ట్రాల్లో వేగవంతమైన చర్యలు ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటి వరకు వేగంగా చార్జ్‌షీట్ దాఖలు చేయడంలో కేరళ, గుజరాత్, యూపీ, హర్యానా రాష్ట్రాలు ముందున్నాయని తెలిపారు.
నేరస్థుల డేటాబేస్ ను డిజిటైలైజ్ చేయడంతోపాటు, డిజిటల్ న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు తెలిపారు. అట్లాగే ఫోరెన్సిక్ సేవల అభివృద్ధిలో కొత్త CFSLల ఏర్పాటుతోపాటు NFSUల విస్తరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 7 సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలు (CFSL) ఉన్నాయని, త్వరలో వీటిని 15 లాబోరేటరీలుగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. జమ్మూ & కాశ్మీర్ లోని సాంబా ప్రాంతంలో ఇప్పటికే ఒక సీఎఫ్ఎస్ఎల్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ మహిళా భద్రతా కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. సమర్థమైన అమలు, పర్యవేక్షణ, కొలిచే ఫలితాలపై దృష్టి నిలుపుకోవాలని పిలుపునిచ్చారు. నిర్ధిష్ట సమయానికి, సమర్థవంతంగా లబ్ధిదారులకు ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రజల్లో విస్త్రత స్థాయిలో అవగాహన పెంచేందుకు ప్రాంతీయ వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు.