Hyderabad Heatwave: హైదరాబాద్లో దంచి కొడుతున్న ఎండలు
నగరంలో వేసవి తాపం ఇంకా తీరలేదు. గత వారం నుంచి నగరంలో వేసవి తాపం మరింత పెరిగింది. దీంతో నగర ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు
- By Praveen Aluthuru Published Date - 04:08 PM, Fri - 16 June 23

Hyderabad Heatwave: నగరంలో వేసవి తాపం ఇంకా తీరలేదు. గత వారం నుంచి నగరంలో వేసవి తాపం మరింత పెరిగింది. దీంతో నగర ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలంగాణకు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయని, తద్వారా వేడిగాలులు వీచే అవకాశముందని, జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ తెలిపింది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) నివేదిక ప్రకారం ఈరోజు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 40.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. నగరంలోని వివిధ ప్రాంతాలలో సికింద్రాబాద్‌లో అత్యధికంగా 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదనంగా సైదాబాద్ మరియు ఆసిఫ్‌నగర్‌లలో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను అధిగమించాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం వేడిగాలులు వీస్తున్నందున పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. కుమురం భీమ్ జిల్లాలో అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, ఖమ్మం వంటి ఇతర జిల్లాల్లోనూ 44 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.జూన్ 19 వరకు హైదరాబాద్‌లో 36-40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త వహించాల్సిన అవసరముంది. పగటిపూట బయటకు వెళ్లేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. బాడీని డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అలాగే పండ్ల రసాలు, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని చెప్తున్నారు. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలని ఐఎండీ సూచించింది.
Read More: CM KCR: మత గురువులకు రాజకీయాలతో సంబంధం ఏంటి?