Telangana: తెలంగాణలో రేషన్ డీలర్ల కమీషన్ భారీగా పెంపు
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. డీలర్లకు ఇచ్చే కమీషన్‌ను టన్నుకు రూ.900 నుంచి రూ.1,400కు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- By Praveen Aluthuru Published Date - 06:55 PM, Tue - 8 August 23

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. డీలర్లకు ఇచ్చే కమీషన్‌ను టన్నుకు రూ.900 నుంచి రూ.1,400కు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీలర్లతో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ చర్చలు జరిపిన అనంతరం వారికిచ్చే కమీషన్ ను పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 17,227 మంది రేషన్ డీలర్లకు ప్రయోజనం చేకూరడంతో పాటు రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.139 కోట్ల అదనపు భారం పడనుంది. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు టన్నుకు 200 రూపాయల కమీషన్ మాత్రమే ఉండేదని, తక్కువ వ్యవధిలో టన్నుకు 1400 రూపాయలకు పెంచామని మంత్రులు గుర్తు చేశారు. దేశంలోనే 700 శాతం కమీషన్ పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. దేశంలోని మరే రాష్ట్రం కూడా కేంద్రం కోటాకు మించి బియ్యం సరఫరా చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా 91 లక్షల మందికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం సరఫరా అవుతున్నాయి. అదేవిధంగా రేషన్ డీలర్లను కూడా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి తీసుకురానున్నట్టు మంత్రులు తెలిపారు.
Also Read: Money From X: ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారతదేశంలోని ట్విట్టర్ యూజర్స్ కి కూడా మనీ..!