స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. తాత్కాలిక పరీక్షల క్యాలెండర్ విడుదల!
SSC సమాచారం ప్రకారం.. మెజారిటీ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలోనే జరుగుతాయి. పరీక్షల దశలు, సిలబస్, పేపర్ల వారీగా పూర్తి వివరాలను ఆయా నోటిఫికేషన్ల ద్వారా కమిషన్ తెలియజేస్తుంది.
- Author : Gopichand
Date : 09-01-2026 - 7:20 IST
Published By : Hashtagu Telugu Desk
SSC Calendar: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో వివిధ రకాల పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ క్యాలెండర్‌లో గ్రాడ్యుయేట్ లెవల్, టెక్నికల్, కానిస్టేబుల్, డిపార్ట్‌మెంటల్ పరీక్షల వివరాలు ఉన్నాయి.
SSC CGL, JE పరీక్షలు ఎప్పుడు?
క్యాలెండర్ ప్రకారం.. SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ (CGL) 2026, SSC జూనియర్ ఇంజనీర్ (JE) పరీక్ష 2026 మే, జూన్ నెలల మధ్య నిర్వహించబడతాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వివిధ హోదాల్లో భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలకు లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతారు. అలాగే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్-14, 2026 ప్రకటన మార్చి 2026లో వెలువడుతుంది. దీనికి సంబంధించిన పరీక్షలు మే, జూలై మధ్య జరిగే అవకాశం ఉంది.
Also Read: హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!
SSC CHSL ఎగ్జామ్ 2026 ఎప్పుడు?
SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ (CHSL) 2026 నోటిఫికేషన్ ఏప్రిల్ 2026లో విడుదల కానుంది. క్యాలెండర్ ప్రకారం.. CHSL టైర్-I పరీక్షలను జూలై, సెప్టెంబర్ మధ్య నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి క్లరికల్, అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
డిపార్ట్‌మెంటల్ పరీక్షలు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)/లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (SSA)/అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) వంటి పోస్టుల కోసం మార్చి 16న నోటిఫికేషన్లు విడుదలవుతాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 7, 2026 వరకు కొనసాగుతుంది. పరీక్షలు మే 2026లో జరుగుతాయి.
పరీక్షా విధానం ఎలా ఉంటుంది?
SSC సమాచారం ప్రకారం.. మెజారిటీ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలోనే జరుగుతాయి. పరీక్షల దశలు, సిలబస్, పేపర్ల వారీగా పూర్తి వివరాలను ఆయా నోటిఫికేషన్ల ద్వారా కమిషన్ తెలియజేస్తుంది. అర్హత ప్రమాణాలు, పరీక్షా సరళి వంటి ఖచ్చితమైన సమాచారం కోసం అభ్యర్థులు కేవలం అధికారిక నోటిఫికేషన్లను మాత్రమే అనుసరించాలని కమిషన్ సూచించింది.