T20 World Cup 2024: వెస్టిండీస్ కు షాక్ సెమీఫైనల్లో సౌతాఫ్రికా
టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు పోరాటానికి సూపర్ 8లోనే తెరపడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో విండీస్ పై విజయం సాధించింది.
- By Praveen Aluthuru Published Date - 12:23 PM, Mon - 24 June 24

T20 World Cup 2024: టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు పోరాటానికి సూపర్ 8లోనే తెరపడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో విండీస్ పై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ అనూహ్యంగా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆరంభంలోనే పూరన్ , హోప్ వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడిన విండీస్ ను కైల్ మేయర్స్ , రోస్టన్ ఛేజ్ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 81 పరుగులు జోడించారు. దీంతో మంచి స్కోరే సాధించేలా కనిపించింది. అయితే చివర్లో సఫారీ బౌలర్లు పుంజుకున్నారు. వెంటవెంటనే వికెట్లు పడగొట్టి విండీస్ ను కట్టడి చేశారు. అంచనాలు పెట్టుకున్న రూథర్ ఫర్డ్ , పావెల్, రస్సెల్ నిరాశపరచడంతో వెస్టిండీస్ 20
ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులే చేసింది. సఫారీ బౌలర్లలో షంషి 3 వికెట్లు తీశాడు.
136 పరుగుల లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ కూడా తడబడుతూ సాగింది. ఫామ్ లో ఉన్న డికాక్ , హెండ్రిక్స్ , మక్ర్ రమ్ త్వరగా ఔటయ్యారు. మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో సౌతాఫ్రికా టార్గెట్ ను 17 ఓవర్లలో 123 పరుగులుగా నిర్ణయించారు. అయితే విండీస్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. స్టబ్స్ 29 , క్లాసెన్ 22 రన్స్ కు ఔటైన తర్వాత విండీస్ గెలిచేలా కనిపించింది. ఈ దశలో మార్కో జెన్సన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్లు పడుతున్నా సింగిల్స్ తీస్తూ సఫారీ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో సౌతాఫ్రికా 19.1 ఓవర్లలో టార్గెట్ ను అందుకుంది. మార్కో జెన్సన్ 14 బంతుల్లో 21 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో ఛేజ్ 3 వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, సౌతాఫ్రికా సెమీఫైనల్లో అడుగుపెట్టాయి.
Also Read: CBSE Compartment: జూలై 15 నుంచి సీబీఎస్ఈ కంపార్ట్‌మెంట్ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే..!