Rathasaptami: అరసవల్లి సూర్యదేవాలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
- Author : Kavya Krishna
Date : 16-02-2024 - 11:14 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ (Arasavelli Suryanarayana Temple) స్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. రథసప్తమి (Ratha Saptami Celebrations) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వెలుగుల రేడు జయంత్యుత్సవం కావడంతో అర్ధరాత్రి పన్నెండున్నరకు ఉత్సవానికి అంకురార్పణం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఆలయ పూజారులు, వివిధ హిందూ మత సంస్థల మఠాధిపతులు ఆలయ ఆలయానికి క్షీరాభిషేకంతో ఉత్సవాన్ని ప్రారంభించారు. దేవాదాయ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ప్రత్యేక దర్శనం టిక్కెట్టు పొందినవారు ఈ మహోత్సవాన్ని తిలకించారు.
We’re now on WhatsApp. Click to Join.
అర్థరాత్రి12.5 నిమిషాలకు స్వామి వారికి క్షీరాభిషేకం ప్రారంభమైంది. పాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలుతో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు అర్చకులు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామి వారి నిజరూప దర్శనమిచ్చారు. దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. అయితే. ఈ నిజరూప దర్శనం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. రథసప్తమి, సూర్యజయంతి సందర్భంగా స్వామి వారికి విశేష పుష్పమాల అలంకరణ సేవ, విశేష అర్చన, నీరాజనం వంటి పూజలను నిర్వహించనున్నారు అర్చకులు.
సూర్య నారాయణ స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరడంతో ఆలయ కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది భక్తులు అరసవల్లి సూర్యభగవానుడి నిజరూప దర్శనం చూసి పులకించిపోయారు.. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే సూర్య జయంతి నాడు ఈ మహా దర్శనం లభించనుండటంతో భారీ సంఖ్యలో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అరసవెల్లి మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి.
సాధారణ భక్తులు.. వీఐపీలతో అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం నిండిపోవడంతో స్వామి వారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోందని భక్తులు చెబుతున్నారు. అయితే… రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రావు, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వామి వారిని దర్శించుకున్నారు. రథసప్తమి సందర్భంగా సర్వాంగ సుందరంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఆదిత్యుని నామస్మరణతో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం మోర్మోగుతోంది.
Read Also : Legalizing Medical Cannabis: గంజాయిని చట్టబద్ధం చేసే బిల్లుపై మరో దేశం సంతకం..!