Rahul Gandhi : త్వరలో రాహుల్ గాంధీ వైజాగ్ టూర్.. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు..!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక సంఘాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు
- By Prasad Published Date - 07:46 AM, Tue - 4 July 23

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక సంఘాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించనున్నారు.రాహుల్ గాంధీ త్వరలో విశాఖపట్నంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ గాజువాక సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఐఎన్‌టియుసి ఉపాధ్యక్షులు జెర్రిపోతుల ముత్యాలు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను రాహుల్ గాంధీ దృష్టికి రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తీసుకెళ్లారన్నారు. గన్నవరం విమానాశ్రయంలో రాహుల్ గాంధీని రుద్రరాజు కలిశారని, ఆయనను కలిసేందుకు కార్మికుల కుటుంబాలు, కార్మిక సంఘాలు ఆసక్తిగా ఉన్నారని వారిని కలవాలని రాహుల్ గాంధీని కోరారని తెలిపారు. రాహుల్ పూర్తి పర్యటన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తామని ముత్యాలు పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగానీ, ఆగస్టు మొదటి వారంలోగానీ రాహుల్ వైజాగ్‌లో పర్యటించే అవకాశం ఉందని తెలిపారు.