Wrestlers: రెజ్లర్ల లైంగిక వేధింపులపై సుప్రీంకోర్టు సీరియస్
గత కొంతకాలంగా రెజ్లర్లు, రెజ్లింగ్ అధ్యక్షుడు మధ్య వివాదం నడుస్తుంది. తమను భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు మహిళ రెజ్లర్లు.
- By Praveen Aluthuru Published Date - 12:13 PM, Wed - 26 April 23

Wrestlers: గత కొంతకాలంగా రెజ్లర్లు, రెజ్లింగ్ అధ్యక్షుడు మధ్య వివాదం నడుస్తుంది. తమను భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు మహిళ రెజ్లర్లు. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదంటూ నిరసనకు దిగారు. మూడు రోజుల పాటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. నిన్న మంగళవారం మహిళ రెజ్లర్లు సుప్రీంలో ఫిర్యాదు చేశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన రెజ్లర్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్‌గా వ్యవహరించింది. కేసును తీవ్రంగా పరిగణించిన సుప్రీం, ఢిల్లీ ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు వారి స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసింది.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ అవసరమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. అదే సమయంలో డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై, ఢిల్లీ పోలీసులు నేరుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు భావిస్తే అదే చేస్తామన్నారు. అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. మీ వద్ద ఎలాంటి వాస్తవాలు ఉన్నాయో వాటిని శుక్రవారం కోర్టు ముందు ఉంచాల్సిందిగా ఆదేశించింది. ఏప్రిల్ 28న రెజ్లర్ల పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు తమ వాదనను వినిపించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.