AP Capital Issue: మంత్రి బొత్సను.. ఆడేసుకుంటున్న టీడీపీ..!
- Author : HashtagU Desk
Date : 08-03-2022 - 9:29 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా 2024 వరకు ఏపీకి హైదరాబాదే రాజధాని అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని ఇష్యూ పై బొత్స వ్యాఖ్యలు చేయడంతో, టీడీపీ నేతలు ఆయన్ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు మూడు రాజధానులు అని రాష్ట్రంలో దరువు వేసిన వైసీపీ సర్కార్, ఇప్పుడు తెరపైకి నాలుగో రాజధానిని తెచ్చిందని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే మూడు రాజధానులంటూ రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం మభ్యపెట్టిందని కేశవ్ ఆరోపించారు.
ఇక ఇప్పుడు తాజాగా నాలుగో రాజధానిని హైదరాబాద్‌ను తెరపైకి బొత్స సత్యనారాయణ తెచ్చారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉపయోపడేలా సీయం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. జగన్ ఏపీని సర్వనాశనం చేయడానికి సిద్ధమవుతున్నారని, రాజధాని అమరావతిని వైసీపీ నేతలు అంగీకరించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. విభజన చట్టంలో ఏపీకి రావాల్సిన అంశాలపై జగన్ ఎదుకు మౌనంగా ఉన్నారని పయ్యావుల కేశవ్ నిలదీశారు. ఇక అమరావతి శాసన రాజధాని మాత్రమేనని, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2024 వరకూ ఉంటుందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేయగా, దానికి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. మరి ఏపీ రాజధాని వ్యవహారం ఇంకా ఎంతదూరం వెళుతుందో చూడాలి.