Pakistan: పాకిస్థాన్‌లో వర్ష బీభత్సం.. 22 మంది పిల్లలతో సహా 35 మంది మృతి
భారతదేశం పొరుగు దేశం పాకిస్తాన్ (Pakistan)లో ఒక వైపు మంచు, వర్షం బీభత్సం సృష్టించగా.. మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
- By Gopichand Published Date - 06:57 PM, Tue - 5 March 24

Pakistan: భారతదేశం పొరుగు దేశం పాకిస్తాన్ (Pakistan)లో ఒక వైపు మంచు, వర్షం బీభత్సం సృష్టించగా.. మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షం, తుఫాను కారణంగా అనేక ఇళ్లు కూలిపోవడంతో పాటు పలు ప్రాంతాల్లో వరద పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి నిరంతర వర్షం, మంచు కారణంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారని పాక్ అధికారి తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు, మంచు కురుస్తున్నాయని పాకిస్థాన్ వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ ముస్తాక్ అలీ షా అన్నారు. సాధారణంగా మార్చి నెలలో వాతావరణం వేడిగా ఉంటుంది. కానీ ఈసారి వాతావరణం చల్లగా ఉందని పేర్కొన్నారు.
పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో 48 గంటలపాటు నిరంతరాయంగా వర్షం కురిసింది. దీని కారణంగా అనేక జిల్లాలు వరదలకు గురయ్యాయి. వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు మూసుకుపోయాయి. వర్షం, కొండచరియలు విరిగిపడటంతో 35 మంది చనిపోయారు. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారు.
Also Read: 4600 RPF Jobs : రైల్వేలో 4660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేసుకోండి
వర్షపు నీటిలో మునిగిన ఇళ్లు
150 ఇళ్లు వర్షపు నీటిలో మునిగిపోగా.. 500కు పైగా ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని పాకిస్థాన్ అధికారులు చెబుతున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా, నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో వర్షం, హిమపాతం గరిష్ట ప్రభావం కనిపించింది. ఈ వారంలో కూడా బలూచిస్థాన్, కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని పాక్ వాతావరణ శాఖ అంచనా వేసింది.
We’re now on WhatsApp : Click to Join