Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు..నాపై దుష్ప్రచారం, బీసీల కోసం పోరాడినందుకే సస్పెండ్..!
గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై, బీసీలకు అన్యాయంగా ఉన్న రిజర్వేషన్ వ్యవస్థపై ప్రశ్నించాను. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన 42 శాతం రిజర్వేషన్ హామీపై నేను ఉద్యమం చేశాను అని ఆమె వివరించారు.
- By Latha Suma Published Date - 12:33 PM, Wed - 3 September 25

Kavitha : నాపై అక్రమంగా కేసులు పెట్టి ఐదున్నర నెలలపాటు జైలులో ఉంచారు. కానీ జైలు నుంచి బయటకి వచ్చిన నాటి నుంచే ప్రజల కోసం నిత్యం పని చేశాను అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 23న జైలు నుంచి విడుదలైన అనంతరం చేసిన పలు ప్రజా సేవా కార్యక్రమాలను కవిత ఇవాళ మీడియా సమావేశంలో గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సెప్టెంబర్ 2న ఆమెకు తాత్కాలిక బహిష్కరణ విధించిన తరవాత తొలిసారి పబ్లిక్‌గా మాట్లాడిన కవిత, పార్టీపై తీవ్రస్థాయిలో స్పందించారు. గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై, బీసీలకు అన్యాయంగా ఉన్న రిజర్వేషన్ వ్యవస్థపై ప్రశ్నించాను. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన 42 శాతం రిజర్వేషన్ హామీపై నేను ఉద్యమం చేశాను అని ఆమె వివరించారు.
మహిళల హక్కుల కోసం పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టిన విషయాన్ని గుర్తుచేసిన ఆమె, వృద్ధులపై తెలంగాణ తల్లి చిత్రాన్ని మారుస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకించానని తెలిపారు. అంతేకాక, ఏపీ నిర్మాణంలో ఉన్న బనకచర్ల ప్రాజెక్టు, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ముందుండినట్టు చెప్పారు. భద్రాచలం వద్ద 5 గ్రామాల ముంపు సమస్యపై స్పందించింది మేమే. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్లో నారాయణపేట వెళ్లి బాధితులకు మద్దతుగా నిలిచాం అని కవిత వివరించారు. గత కొన్ని నెలలుగా ఆమె 47 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించామని తెలిపారు. ఇవి పార్టీ వ్యతిరేక చర్యలా? కేసీఆర్‌కు ఆ విషయాన్ని నేను ప్రశ్నిస్తున్నా అంటూ కవిత మండిపడ్డారు.
ఇక, తన సస్పెన్షన్‌పై స్పందిస్తూ..బీసీల హక్కుల కోసం పోరాడుతున్న నన్ను… కొందరు పార్టీ నేతలు పనికట్టుకుని దుష్ప్రచారం చేశారు. ఇది న్యాయమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు, సంతోష్ రావులు కవిత తండ్రి కేసీఆర్ చుట్టూ ఉన్న “దెయ్యాలు” అన్న ఆమె వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం అవినీతికి కారణం వారే. అందుకే రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ కొంతకాలం హరీష్ రావును అణచివేశారు అంటూ ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలే చివరకు పార్టీకి నష్టం చేకూర్చాయని బీఆర్ఎస్ భావించినట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి ఆమెను తొలగించిన తరువాత, ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేటీఆర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సంజయ్ తదితరులు హాజరయ్యారు. బంగారు తెలంగాణ అనేది నా కల. అది కొంతమంది ఇళ్లలో బంగారం ఉన్నదంత మాత్రాన రాదు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి కలగాలి. అదే నా అభిప్రాయం. కానీ దాన్ని తప్పుగా ప్రచారం చేశారు అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా నష్టపెట్టే ప్రయత్నం చేశారని ఆమె పేర్కొన్నారు. మొత్తం మీద, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ను, తెలంగాణ రాజకీయాలను హిలిచిన వేళ పార్టీ నిర్ణయాలపై మళ్లీ చర్చ మొదలైంది. ఆమె సస్పెన్షన్ రద్దవుతుందా? లేదా కొత్త రాజకీయ ప్రస్థానానికి ఆమె బీజం వేస్తారా? అన్నది మరికొన్ని రోజుల్లో స్పష్టమవనుంది.