నెల్లూరుకు చేరిన గౌతమ్ రెడ్డి భౌతిక కాయం
- Author : HashtagU Desk
Date : 22-02-2022 - 3:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి స్పెషల్ హెలికాఫ్టర్‌లో నెల్లూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరింది. ఈ క్రమంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గౌతమ్ రెడ్డి పార్థీవదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ఈరోజు కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం కోసం మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని అక్కడే ఉంచనున్నారు. ఇప్పటికే అమెరికా నుండి బయలుదేరిన గౌతమ్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి ఈ రాత్రికి నెల్లూరుకు చేరుకోనున్నారు.
ఇక తమ అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు మేకపాటి అభిమానులు ఆయన నివాసానికి భారీగా తరలి వస్తున్నారు. గౌతంరెడ్డి లేరన్న వార్తను జీర్ణించుకోలేక ఆయన వ్యక్తిగత సిబ్బంది కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మేకపాటి అంత్యక్రియలకు సంబంధించి లైవ్ అప్‌గేట్స్ కోసం వచ్చిన జర్నలిస్టులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు. ఇక బుధవారం ఉదయం 11 గంటలకు మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతంరెడ్డి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. ఇకపోతే గౌతం రెడ్డి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్‌లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.