Mlc Candidates : అధిష్టానానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా : మహేష్ కుమార్ గౌడ్
క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగా కొంతమేరకు పథకాలు లబ్ధిదారులకు అందడం లేదని తెలిపారు.
- By Latha Suma Published Date - 05:58 PM, Thu - 30 January 25

Mlc Candidates : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టును అధిష్టానానికి పంపినట్టు తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగలరనే నమ్మకం తనకు ఉందన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేసారు. రిజర్వేషన్ల పెంపు తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని తెలియజేసిన ఆయన.. ఫిబ్రవరి 5న కులగణన నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదనే ప్రశ్నకు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగా కొంతమేరకు పథకాలు లబ్ధిదారులకు అందడం లేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను అధిష్ఠానానికి పంపించామని ఆయన పేర్కొన్నారు.
కాగా, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. అయితే వాటిలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 03న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 03న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ఎన్నికలు జరుగనున్న జిల్లాలో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.