Virat Kohli: లంకతో టీ ట్వంటీలకు కోహ్లీ దూరం
వెస్టిండీస్ సిరీస్ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న సిరీస్‌కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. లంకతో భారత్ మూడు టీ ట్వంటీలు, రెండు టెస్టులు ఆడనుండగా..
- By Naresh Kumar Published Date - 05:43 PM, Fri - 18 February 22

వెస్టిండీస్ సిరీస్ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న సిరీస్‌కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. లంకతో భారత్ మూడు టీ ట్వంటీలు, రెండు టెస్టులు ఆడనుండగా.. టీ ట్వంటీ సిరీస్‌కు కోహ్లీ దూరం కానున్నాడు. బిజీ షెడ్యూల్ నుండి విశ్రాంతి తీసుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. లంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు కోహ్లీ మళ్ళీ జట్టులోకి రానున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా విరామం లేని క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్ళకు బీసీసీఐ రొటేషన్ పాలసీలో విశ్రాంతినిస్తోంది. ఇదిలా ఉంటే విండీస్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే లక్నో చేరుకున్న జడేజా క్వారంటైన్‌లో ఉన్నాడు. జడేజాతో పాటే బూమ్రాకు కూడా విండీస్‌తో సిరీస్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.
కాగా ప్రస్తుతం విండీస్‌తో ఆడుతున్న జట్టునే దాదాపుగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్,రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ విండీస్‌తో సిరీస్‌కు దూరమయ్యారు. వీరి స్థానంలో రీప్లేస్‌మెంట్స్‌గా వచ్చిన వారే జట్టుతో పాటు కొనసాగనున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ నిబంధనల దృష్ట్యా గాయాల నుండి కోలుకున్న వారు వచ్చినా క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత జట్టుతో కలవాల్సి ఉంటుంది. దీంతో ముందు జాగ్రత్తగా కొందరిని బ్యాకప్‌గా ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది.
శ్రీలంకతో ఫిబ్రవరి 24 నుండి టీ ట్వంటీ సిరీస్ మొదలు కానుండగా.. మార్చి 4 నుండి టెస్ట్ సిరీస్ షురూ కానుంది. వెస్టిండీస్‌తో చివరి టీ ట్వంటీ ముగియడంతోనే సెలక్టర్లు జట్టు ఎంపికపై ప్రకటన చేయనున్నారు. తొలి టీ ట్వంటీ లక్నోలో జరగనుండగా.. తర్వాతి రెండు మ్యాచ్‌లకూ ధర్మశాల ఆతిథ్యమివ్వనుంది. ఇక తొలి టెస్ట్ మొహాలీలో జరగనుండగా… రెండో టెస్ట్ డే నైట్ మ్యాచ్‌గా బెంగళూరులో నిర్వహించనున్నారు. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టెస్ట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్ట్. నిజానికి బెంగళూరులోనే ఈ మ్యాచ్ జరుగుతుందని భావించినా.. బీసీసీఐ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అలాగే లంక క్రికెట్ బోర్డు విజ్ఞప్తితో ముందే టీ ట్వంటీ సిరీస్ ఉండేలా షెడ్యూల్‌లో మార్పులు చేసింది.