IND vs AUS 2nd ODI: రెండో వన్డేలో చిత్తుగా ఓడిన ఆసీస్.. సిరీస్ కైవసం
- By Praveen Aluthuru Published Date - 11:19 PM, Sun - 24 September 23

IND vs AUS 2nd ODI: సన్నాహక మ్యాచ్ లో టీమిండియా జోరు కొనసాగిస్తుంది. ఆసీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి రెండు వన్డేల్లో టీమిండియా విజయఢంకా మోగించింది. టీమిండియా మూడు వన్డేల సిరీస్ ని 2-0 తో కైవసం చేసుకుంది.
ఇండోర్ వేదికగా ఈరోజు ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 99 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకు కుప్పకూలిపోయింది. డేవిడ్ వార్నర్ (53; 39 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్), సీన్ అబాట్ (54; 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు) అర్థశతకాలు బాదారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు చెరో మూడు వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణ రెండు, షమీ ఓ వికెట్ తీసుకున్నాడు. అయితే మ్యాచ్ మధ్యలో వర్షం కురవడంతో ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులకు కుదించారు.
టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 97 బంతులు ఆడి 104 పరుగులతో శతకాన్ని కొట్టాడు. ఇందులో 6 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ లో సెంచరీతో కదం తొక్కాడు. అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేశాడు. అయ్యర్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఇక సూర్యకుమార్ యాదవ్ మరో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య (72*; 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), కెప్టెన్ కేఎల్ రాహుల్ (52; 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశారు. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు బాది 31పరుగులతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ రెండు, సీన్ అబాట్, హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా తలా ఓ వికెట్ పడగొట్టారు.
Also Read: Yuvagalam : యువగళం ఎఫెక్ట్.. నెల రోజుల పాటు రాజమండ్రి బ్రిడ్జి మూసివేతకు ఆదేశాలు జారీ