Increased Cold : వణికిస్తున్న చలి..పగలు..రాత్రి వణుకుడే..!!
Increased Cold : తెలంగాణ విషయానికి వస్తే..ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్న వాతావరణ శాఖ వచ్చే మూడురోజులు మరింత తీవ్రం కానందని తెలిపింది. అంతే కాదు మూడు జిల్లాలలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేస్తూ..30 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది
- By Sudheer Published Date - 11:53 AM, Mon - 25 November 24

రెండు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా చలి (COld) వణికిస్తోంది. పగలు , రాత్రి అనే తేడాలు లేకుండా , పల్లె, పట్నం తేడా లేకుండా దేశాన్ని చలి వణికిస్తోంది. తెలంగాణ (Telangana) విషయానికి వస్తే..ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్న వాతావరణ శాఖ వచ్చే మూడురోజులు మరింత తీవ్రం కానందని తెలిపింది. అంతే కాదు మూడు జిల్లాలలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేస్తూ..30 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మూడు రోజులుగా చలిగాలుల తీవ్రత పెరిగింది. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెంలో 12.2 డిగ్రీలు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాబాద్‌లలో 12.6 డిగ్రీలు, మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో 13.8 డిగ్రీలు, కుత్బుల్లాపూర్, శామీర్‌పేటలో 14.4 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మన్నెగూడలో 12.2 డిగ్రీలు, కోట్‌పల్లిలో 12.4, వికారాబాద్‌లో 12.7డిగ్రీల, అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతోన్నాయి. పలు ప్రాంతాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో ఉదయం వాకింగ్ వెళ్లే వారి సంఖ్య తగ్గుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు .చలి తీవ్రత పెరిగినందున చిన్నారులు, వృద్ధులు వ్యాధులతో బాధపడుతున్నవారు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.
ఏపీ విషయానికి వస్తే.. గత పది రోజులుగా గిరిజన ప్రాంతలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం జి.మాడుగులలో 10.5, డుంబ్రిగుడలో 10.8, అరకులోయలో 11, ముంచంగిపుట్టులో 12.1, హుకుంపేటలో 12.5, జీకేవీధిలో 13, పెదబయలులో 13.1, పాడేరులో 13,6, చింతపల్లి, అనంతగిరిలో 14.2, కొయ్యూరులో 17.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
Read Also : Winter Session Of Parliament: పార్లమెంట్ లో శీతాకాల సమావేశాలు ప్రారంభం… ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా!