Telangana High Court : ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక నిర్ణయం
Telangana High Court : బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లు అసెంబ్లీ కార్యదర్శి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి.
- By Latha Suma Published Date - 01:38 PM, Thu - 3 October 24

Disqualification of MLAs: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ నెల 24న వాదనలు వింటామని తెలిపింది. సెప్టెంబర్ 9న ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మూడు అంశాలపై ప్రధానంగా చర్చించింది. బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లు అసెంబ్లీ కార్యదర్శి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పెండింగ్ పిటిషన్లకు సంబంధించిన అంశాన్ని స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లాలి. అనర్హత వేటుకు సంబంధించిన అంశాల్లో వాదనలు వినాలి. అలాగే షెడ్యూల్ ఖరారు చేయాలి. వీటన్నింటికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను హైకోర్టుకు సమర్పించాలన్నదే ఆ తీర్పులోని సారాంశం.
Read Also: Cm Revanth Reddy : కుటుంబ డిజిటల కార్డుల ప్రక్రియను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని, స్టేటస్ రిపోర్ట్‌ను తమకు అందజేయాలని తీర్పిచ్చింది. అయితే కోర్టు ఇచ్చిన నాలుగు వారాల గడువు ముగియనుంది. ఈ తరుణంలో రెండ్రోజుల క్రితం అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపైన స్టే విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్ ఈ అంశంపై స్టే విధించి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అయితే దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ మాత్రం అందుకు అంగీకరించలేదు. అసెంబ్లీ కార్యదర్శి తరుఫున కోర్టులో వాదించిన అడ్వకేట్ జనరల్ చెప్పే విషయాలన్నింటిని తాము వినేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ నెల 24న వాదనలు వింటామని సూచించింది. కాగా, దానం, కడియం, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని.. గతంలో హైకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్. దీంతో మరో పది రోజుల్లో… దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు పడే ఛాన్స్ ఉంది.