AP Assembly: నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
- Author : HashtagU Desk
Date : 22-03-2022 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. ఈరోజు కూడా టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగడంతో , స్పీకర్ తమ్మినేని తీరుమార్చుకోవాలని వారిని మందలించారు. అయినా వినకుండా సభా కార్యక్రమాలకు అడ్డుపడుతుండడంతో నలుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు బెందాళం అశోక్, రామరాజు, అనగాని సత్యప్రసాద్, వెలగపూడి రామకృష్ణలను ఈ సెషన్ వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఇక సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వచ్చి మరీ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన కల్లీ సారా మరణాలకు సంబంధించిన ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పలుమార్లు పోడియం వద్దకు రావద్దని స్పీకర్ హెచ్చరించినా, వినకుండా టీడీపీ సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో అసెంబ్లీ మొత్తం సమావేశాల నుంచి నలుగురు తెలుగు దేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.