Theatres Issue:రేపు ఏపీ మంత్రి పేర్ని నానిని కలవనున్న సినీ పెద్దలు.. !
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు రాజకీయ నాయకులు కూడా తమదైన శైలిలో దీనిపై స్పందిస్తున్నారు.
- Author : Hashtag U
Date : 27-12-2021 - 7:39 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు రాజకీయ నాయకులు కూడా తమదైన శైలిలో దీనిపై స్పందిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో అనుమతి లేని థియేటర్లపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో థియేటర్లు నడపలేక చాలా మంది యజమానులు సినిమా హాళ్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ విషయంపై మంత్రిని కలవడానికి ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లను అపాయింట్‌మెంట్ అడిగారు. సినిమా టిక్కెట్ల ధరలపై పలువురు సినీ హీరోలు, నిర్మాతలు చేస్తున్న వ్యాఖ్యలతో ఇబ్బంది పడుతున్నామని థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. దీంతో ప్రభుత్వంతో చర్చించి వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. అనుమతి ఇచ్చిన తర్వాత మంగళవారం నాడు మంత్రిని కలవాలని థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.