Farmers: రెండో రోజు రైతుల నిరసన..ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
- Author : Latha Suma
Date : 14-02-2024 - 12:50 IST
Published By : Hashtagu Telugu Desk
Farmers Protest Delhi : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా ఇతర సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం ఢిల్లీ చలోకు పిలుపునిచ్చిన రైతులు(Farmers )బుధవారం కూడా మార్చ్‌ను కొనసాగిస్తున్నారు. బుధవారం మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని రైతులు తెలిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు మరింత మంది రైతులు రానున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. పంజాబ్, హరియాణా సరిహద్దులతో పాటు ఢిల్లీ(Delhi )లో భద్రతను కట్టుదిట్టం( tight security) చేశారు. భారీగా RAF బలగాలను మోహరించారు. సరిహద్దుల వద్ద మరిన్ని కాంక్రీటు దిమ్మెలు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై భారీ కందకాలు తవ్వారు. ఢిల్లీలో 144 సెక్షన్ అమలు చేసి, రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మంగళవారం ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న రైతులు రాత్రంతా రోడ్లపైనే గడిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు వచ్చిన వారి కోసం బుధవారం ఉదయం టీ, అల్పాహారాన్ని సిద్ధం చేశారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా, తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. అయితే, రైతులు కొత్త డిమాండ్లు చేస్తున్నారని, వాటిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించొద్దని వారికి విజ్ఞప్తి చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
మంగళవారం రైతులు చేపట్టిన ఢిల్లీ చలో రణరంగమైంది. రైతులు, పోలీసుల మధ్య పలు చోట్ల తీవ్ర ఘర్షణలు జరిగాయి. బారికేడ్లను ధ్వంసం చేసుకుని మరీ రైతులు ముందుకు సాగడం వల్ల పోలీసులు బాష్ప వాయుగోళాలను, రబ్బర్ బుల్లెట్లను, జల ఫిరంగులను ప్రయోగించారు. డ్రోన్లనూ వినియోగించారు. ఈ ఘటనల్లో పలువురు పోలీసులు, రైతులు గాయపడ్డారు.
read also : Navy Dress Code: భారత నౌకాదళంలో కొత్త డ్రెస్ కోడ్.. విశేషాలివే..!