Earthquake Tremors: కంపించిన భూమి.. ఇళ్ల పైకప్పులు, గోడలకు పగుళ్లు!
భూకంపం ధాటికి ప్రజల ఇళ్ల పైకప్పులు, గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
- Author : Gopichand
Date : 24-01-2025 - 8:58 IST
Published By : Hashtagu Telugu Desk
Earthquake Tremors: భూ ప్రకంపనలతో (Earthquake Tremors) మరోసారి భూమి కంపించింది. మయన్మార్‌లో నిన్న అర్థరాత్రి సంభవించిన భారీ భూకంపం కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేకపోయినా ప్రకంపనల ప్రభావానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రాత్రి 1 గంట ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమి కింద 106 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ వారం ప్రారంభంలో మయన్మార్‌లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని కూడా అధికారులు తెలిపారు. అంతకుముందు డిసెంబర్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఆఫ్ఘనిస్తాన్, ఫిలిప్పీన్స్‌లో కూడా భూకంపం
మయన్మార్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, ఫిలిప్పీన్స్‌లో కూడా భూకంపాలు సంభవించాయి. ఫిలిప్పీన్స్‌లో రెండుసార్లు భూకంపాలు సంభవించాయి. ఫిలిప్పీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ (PHIVOLCS) భూకంపాన్ని ధృవీకరించింది. మొదటి భూకంపం 5.4 తీవ్రతతో సంభవించిందని, రెండవ భూకంపం 5.9 తీవ్రతతో సంభవించిందని తెలిపింది. భూకంపంపై బులెటిన్ విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో లేటే ప్రావిన్స్‌లో భూమికింద 6 మైళ్లు లేదా 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
భూకంపం ధాటికి ప్రజల ఇళ్ల పైకప్పులు, గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. పలు నగరాల్లో రోడ్లకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. జాతీయ రహదారిపై రోడ్డు పగుళ్లు ఏర్పడడంతో రహదారిని మూసివేశారు. శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ చీఫ్ బర్నీ కాపిగ్ ప్రజలపై నిఘా ఉంచడానికి నగరం అంతటా దళాలను మోహరించారు. భూకంపంతో భయాందోళనకు గురైన ప్రజలు రోజంతా భయంతోనే జీవించారు.