Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్!
దర్యాప్తు సంస్థ ప్రకారం.. షోయబ్ ఉమర్‌కు తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే కాకుండా అతనికి పేలుడు పదార్థాలను చేరవేయడం, సురక్షిత మార్గాలను చూపించడం, పరారయ్యేందుకు కూడా సహాయం చేశాడు.
- By Gopichand Published Date - 06:15 PM, Wed - 26 November 25
Delhi Blast Case: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు కేసులో (Delhi Blast Case) అరెస్టయిన ఇద్దరు నిందితులను ఎన్ఐఏ బుధవారం ఢిల్లీ కోర్టులో హాజరుపరిచింది. నిందితులు షోయబ్, ఆమిర్ రషీద్ అలీలను ప్రధాన జిల్లా, సెషన్స్ జడ్జి అంజూ బజాజ్ చందనా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ కేసులోని నిందితుడు షోయబ్‌ను 10 రోజుల ఎన్‌ఐఏ రిమాండ్‌కు పంపింది. ఆమిర్ రిమాండ్‌ను మరింత పొడిగించాలని ఎన్‌ఐఏ కోరగా.. ఆమిర్‌కు 7 రోజుల రిమాండ్ ఇవ్వబడింది. షోయబ్‌పై ఉగ్రవాది ఉమర్‌కు ఆశ్రయం ఇచ్చినట్లు ఆరోపణ ఉంది. ఆమిర్ రషీద్ ఈ కేసులో మొదటి నిందితుడు కాగా.. షోయబ్ ఏడవ నిందితుడు.
షోయబ్ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌లో భాగం
ఎర్రకోట సమీపంలో పేలుడు పదార్థాలు నిండిన కారును నడిపిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం ఇచ్చాడనే ఆరోపణల మేరకు ఎన్‌ఐఏ ఫరీదాబాద్ నుండి షోయబ్‌ను అరెస్టు చేసింది. ఎన్‌ఐఏ ప్రకారం.. ఫరీదాబాద్‌లోని ధౌజ్ నివాసి అయిన షోయబ్ ఉగ్రవాది ఉమర్‌కు సామాగ్రి అందించాడు. జమ్మూ పోలీసులు అతన్ని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌గా బహిర్గతం చేశారు. దర్యాప్తు సంస్థ ఆత్మహుతి దాడికి సంబంధించిన వివిధ ఆధారాలపై పనిచేస్తోంది. ఈ ఘోరమైన దాడిలో పాల్గొన్న ఇతర వ్యక్తులను గుర్తించి, పట్టుకునే ప్రయత్నంలో సంబంధిత పోలీసు బలగాల సమన్వయంతో వివిధ రాష్ట్రాలలో తనిఖీలను నిర్వహిస్తోందని ఎన్ఐఏ పేర్కొంది.
Also Read: Indian Constitution: భారత రాజ్యాంగం.. డా. అంబేద్కర్ ఒక్కరే రాశారా?
ఉగ్రవాది ఉమర్‌కు సామాగ్రి సరఫరా
దర్యాప్తు సంస్థ ప్రకారం.. షోయబ్ ఉమర్‌కు తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే కాకుండా అతనికి పేలుడు పదార్థాలను చేరవేయడం, సురక్షిత మార్గాలను చూపించడం, పరారయ్యేందుకు కూడా సహాయం చేశాడు. అతని లొకేషన్, కాల్ వివరాల విచారణలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. షోయబ్‌కు ఏదైనా పెద్ద ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధం ఉండవచ్చని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఎన్‌ఐఏ దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులను వేగవంతం చేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో ఏకకాలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.