Musi : సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన పాదయాత్ర ప్రారంభం
Musi : సంగెం వద్ద మూసీ నదిలో నీటిని పరిశీలనకు తీసుకొని శాంపిల్స్ పరిశీలించారు. వాటిని ల్యాబ్ కు పంపించనున్నట్టు తెలుస్తుంది.
- By Latha Suma Published Date - 05:42 PM, Fri - 8 November 24

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన పాదయ్రాతను ప్రారంభించారు. ఈ క్రమంలోనే యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో మూసీ ప్రవహించే సంగెం బ్రిడ్జి వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సంగెం దగ్గర భీమలింగంకు పూజలు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభం అయింది. సంగెం వద్ద మూసీ నదిలో నీటిని పరిశీలనకు తీసుకొని శాంపిల్స్ పరిశీలించారు. వాటిని ల్యాబ్ కు పంపించనున్నట్టు తెలుస్తుంది.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డిలు దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం పర్యటన కోసం 2వేల మందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. సంగెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర భీమలింగం-ధర్మారెడ్డి పాలెం కెనల్ గుండా సాయంత్రం నాగిరెడ్డి పాలెం చేరుకొని అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
నల్లగొండ జిల్లా ప్రజలు, మూసీ పరీవాహక ప్రాంత రైతాంగంలోకి విస్తృతంగా తీసుకువెళ్లే పనిలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉంది. మూసీ ప్రక్షాళణ విషయంలో ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో మల్లన్నసార్ నుంచి యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు తాగునీరు అందించే ప్రాజెక్టును రూ.210 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనుండగా ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.