TTD: టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు భారత్ బయోటెక్ భారీ విరాళం
టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు భారత్ బయోటెక్ రూ.2 కోట్ల భారీ విరాళం అందజేసింది.
- By Hashtag U Published Date - 01:01 PM, Thu - 13 January 22

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు భారత్ బయోటెక్ రూ.2 కోట్ల భారీ విరాళం అందజేసింది. భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా ఈ మొత్తాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డిలకు అందజేసి అనంతరం తిరుమల శ్రీవారి సేవల్లో పాల్గొన్నారు. అలాగే శబరిమలలో అన్నదానం కోసం శబరిమల అయ్యప్పస్వామికి డిసెంబర్ నెలలో కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా కోటి విరాళం అందించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుమలకు రూ.2 కోట్ల విరాళాన్ని అందించారు.
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిత్య సేవలు, కైంకర్యాలు అనంతరం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ దర్శనం ప్రారంభమైంది. మొదటి ప్రొటోకాల్ ప్రకారం శ్రీవారి దర్శనానికి వీఐపీలను అనుమతిస్తారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. భక్తులు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. గురువారం స్వామివారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. వీఐపీలతో సహా భక్తులందరికీ సమయానుకూలంగా దర్శన టిక్కెట్లు, టోకెన్లు జారీ చేశారు.