Nipah Virus: కేరళలో నిఫా.. అలర్ట్ అయిన కర్ణాటక ప్రభుత్వం
నిఫా వైరస్ తో కేరళలో ఆంక్షలు మొదలవ్వనున్నాయి. ఆ రాష్ట్రలో నిఫా సోకి ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. దీంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది.మూడు జిల్లాలను కంటైన్మెంట్ జోన్లుగా పేర్కొంటూ ఆంక్షలు విధించింది .
- By Praveen Aluthuru Published Date - 07:57 PM, Wed - 13 September 23

Nipah Virus: నిఫా వైరస్ తో కేరళలో ఆంక్షలు మొదలయ్యాయి. కేరళలో నిఫా సోకి ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. దీంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మూడు జిల్లాలను కంటైన్మెంట్ జోన్లుగా పేర్కొంటూ ఆంక్షలు విధించింది . పాఠశాలలతో పాటు ప్రయివేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆంక్షలు విధించారు.
కరోనా మహమ్మారి తరువాత నిఫా మరోసారి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది. ఇక కేరళలో నిపా కేసులు నిర్ధారణ కావడంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. దక్షిణ కన్నడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోకి వచ్చే గూడ్స్ వాహనాలను తనిఖీ చేసేందుకు సరిహద్దు పాయింట్ల వద్ద చెక్‌పోస్టులను తెరవాలని ఆరోగ్య శాఖ పోలీసులను కోరింది. కేరళ నుంచి రాష్ట్రంలోకి వచ్చే పండ్లను తనిఖీ చేయాలని పోలీసులను ఆదేశించారు. మంగుళూరులోని ఎనిమిది వైద్య కళాశాలల్లో బ్రెయిన్ ఫీవర్ అనుమానంతో తమ వద్దకు వచ్చే రోగులను పరిశీలనలో ఉంచాలని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సుదర్శన్ కోరారు.
సుదర్శన్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని తాలూకా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జ్వరాల సర్వేను సత్వరమే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఐసోలేషన్ వార్డులు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. దక్షిణ కన్నడలో ఇప్పటివరకు ఎలాంటి నిపా కేసు నమోదు కానప్పటికీ, పొరుగున ఉన్న కేరళలో వ్యాధి వ్యాప్తి చెందినట్లు నిర్ధారించిన తర్వాత ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
Also Read: Jayalalitha: సీనియర్ నటి జయలలిత ఎదుర్కొన్న కష్టాలు