Trump Blocked : ట్రంప్‌పై ‘మెయిన్’ బ్యాన్.. అధ్యక్ష ఎన్నికల బాటలో రెడ్ సిగ్నల్
Trump Blocked : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది.
- Author : Pasha
Date : 29-12-2023 - 8:09 IST
Published By : Hashtagu Telugu Desk
Trump Blocked : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. 2024 మార్చిలో జరగనున్న రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష ప్రైమరీ ఎంపిక ప్రక్రియలో పాల్గొనకుండా ఆయనపై ఇటీవల కొలరాడో సుప్రీంకోర్టు బ్యాన్ విధించింది. ఇప్పుడు మరో అమెరికా రాష్ట్రం ఆ జాబితాలో చేరింది. మెయిన్ రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం కూడా ట్రంప్‌పై బ్యాన్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2021 జనవరిలో యూఎస్ క్యాపిటల్‌పై జరిగిన దాడిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఉన్నందున .. వచ్చే ఏడాది జరిగే రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో పాల్గొనేందుకు ఆయన అనర్హుడని తీర్పులో పేర్కొంది. యూఎస్ క్యాపిటల్‌పై దాడి అనేది ట్రంప్‌కు తెలిసే జరిగిందని.. ఆ దాడికి పాల్పడిన వారికి ట్రంప్ నుంచి సహకారం కూడా లభించిందని మెయిన్ రాష్ట్ర కోర్టు వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
‘‘దేశపు ప్రభుత్వ పునాదులపై దాడిని అమెరికా రాజ్యాంగం సహించదు. మెయిన్ రాష్ట్ర చట్టాలు కూడా అందుకు అంగీకరించవు. దీనిపై చర్యగానే మేం వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ట్రంప్‌ను నిరోధిస్తున్నాం’’ అని మెయిన్ రాష్ట్ర న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇంతకుముందు కొలరాడో కోర్టు, ఇప్పుడు మెయిన్ కోర్టు.. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ట్రంప్‌పై చర్యలు తీసుకున్నాయి. ఈ తీర్పులపై అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్ సవాలు చేయనున్నారు. జనవరిలో ఈ పిటిషన్లు అమెరికా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు(Trump Blocked) రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం దక్కే అవకాశాలను తగ్గిస్తాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.