Ramoji Rao: ఘనమైన నివాళి.. ఉత్తరాంధ్రలో రామోజీరావుకు నిలువెత్తు విగ్రహాం
- By Balu J Published Date - 11:51 PM, Fri - 14 June 24

Ramoji Rao: భావితరాలకు గుర్తుండిపోయేలా.. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. శుక్రవారం కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్న శిల్పి వద్దకు వెళ్లి, రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించేందుకు సన్నద్ధం చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ తొలినాళ్లలో ఉత్తరాంధ్రలో తెలుగు పత్రిక ఈనాడును ప్రస్థానం చేయించిన ఘనత రామోజీరావుకి దక్కుతుందని పేర్కొన్నారు.
తొలినాళ్లలోనే విశాఖ తీరంలో ఈనాడు పత్రికను స్థాపించి.. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని రామోజీరావు చైతన్యపరిచారని అన్నారు. ప్రజా సమస్యలను ఈనాడు పత్రికలో వార్తల రూపంలో ప్రచురించి, ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించే దిశగా వారధి వలె రామోజీరావు పనిచేశారని తెలిపారు.
ఉత్తరాంధ్రలో పత్రిక ముద్రణ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, తొలినాళ్లలో ఇక్కడి నుంచే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఈనాడు పత్రికను పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. దానికి కృతజ్ఞతగా ప్రస్తుతం ఉత్తరాంధ్రలో రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని తొలుతగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని స్పష్టం చేశారు.