Makar Sankranti 2024: అత్తాపూర్‌లో విషాదం.. ప్రాణం తీసిన గాలిపటం
సంక్రాంతి అనగానే రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు గుర్తుకు వస్తాయి. గాలిపటాలు ఎగురవేయాలనే మోజుతో కొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది
- Author : Praveen Aluthuru
Date : 13-01-2024 - 9:59 IST
Published By : Hashtagu Telugu Desk
Makar Sankranti 2024: సంక్రాంతి అనగానే రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు గుర్తుకు వస్తాయి. గాలిపటాలు ఎగురవేయాలనే మోజుతో కొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, పెద్ద విద్యుత్ లైన్ల దగ్గర గాలిపటాలు ఎగురవేయడం ప్రమాదకరం. విశాలమైన ప్రాంతాలు, మైదానాలలో ఎగురవేయాలి.
సంక్రాంతి పండుగ సందర్భంగా అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది . గాలిపటం ఎగురవేస్తుండగా బాలుడు విద్యుత్ తీగలను తాకాడు. దీంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. పతంగులు ఎగురవేసేందుకు స్నేహితులతో కలిసి మేడపైకి వెళ్లిన తనిష్క్ గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ లైన్లు, స్తంభాలు, సబ్ స్టేషన్లకు చిక్కిన గాలి పటాలను తీసుకునే ప్రయత్నం చేయవద్దు. గాలిపటాలకు కాటన్, నైలాన్, లినెన్ దారాలు మాత్రమే వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మెటాలిక్ దారాలను ఉపయోగించకూడదు. అవి విద్యుత్ తీగలకు తగిలితే పెను ప్రమాదం పొంచి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో 1912 లేదా సమీపంలోని విద్యుత్ సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వాలి.
Also Read: Devil: ఓటీటీలోకి వచ్చేస్తున్న కళ్యాణ్ రామ్ డేవిల్, ఎప్పుడంటే!