OYO Room : ఓయో రూమ్ కోసం ‘ఆధార్’ ఇస్తున్నారా ? ఇది తెలుసుకోండి
ఓయో రూమ్(OYO Room)ను తాత్కాలిక వసతి కోసం మనం వాడుతుంటాం.
- By Pasha Published Date - 11:18 AM, Wed - 26 March 25

OYO Room : మన దేశంలో ఓయో రూమ్స్ బుకింగ్స్ గణనీయంగా పెరిగిపోయాయి. వీటిని వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉంటున్నారు. ఓయో రూమ్స్‌ను బుకింగ్ చేసుకునే క్రమంలో ఆధార్ కార్డ్‌ను చూపించడం తప్పనిసరి. కస్టమర్ల భద్రత కోసం ప్రభుత్వం ఈ రూల్‌ను అమలు చేస్తోంది. అయితే ఆధార్ కార్డ్‌ను ఓయో హోటల్ నిర్వాహకులకు ఇచ్చే క్రమంలో మనం కొన్ని సేఫ్టీ టిప్స్‌ను పాటించాలి. అవేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..
మాస్క్డ్ ఆధార్ కార్డ్.. చాలా సేఫ్
ఓయో రూమ్(OYO Room)ను తాత్కాలిక వసతి కోసం మనం వాడుతుంటాం. ఆ చిన్న పని కోసం విలువైన మన ఆధార్ కార్డు సమాచారమంతా ఓయో హోటల్ నిర్వాహకుల చేతిలో పెట్టడం మూర్ఖత్వమే అవుతుంది. ఈ విధమైన అవసరాల కోసం మనం మాస్క్‌డ్ ఆధార్ కార్డ్‌ను వాడాలి. ఇది చాలా సేఫ్ పద్ధతి. ఎందుకంటే.. మాస్క్‌డ్ ఆధార్ కార్డ్ అనేది భౌతికంగా ఉండదు. కేవలం డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు మాస్క్‌డ్ ఆధార్ కార్డుపై కేవలం చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఆధార్ నంబర్‌లోని మొదటి 12 అంకెలపై మాస్క్ ఉంటుంది. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశాలు తగ్గుతాయి.
మాస్క్డ్ ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ ఇలా..
- మీరు తొలుత UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లోకి వెళ్లాలి.
- ‘మై ఆధార్’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి.. ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయండి.
- మీ ఫోనుకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి.
- OTP ధృవీకరణ పూర్తయ్యాక మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి.
- డౌన్‌లోడ్ ఆప్షన్‌లో “మాస్క్‌డ్ ఆధార్”ను ఎంపిక చేసుకోండి. దీనిలో మీ ఆధార్ నంబర్‌లోని చివరి 4 అంకెలు కనిపిస్తాయి.
- మాస్క్‌డ్ ఆధార్ కార్డు PDF ఫైల్‌ని ఓపెన్ చేయడానికి.. మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, పుట్టిన సంవత్సరం (DOB) కలిపి పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకోండి.