BJP Politics: అద్వానీ చెప్పినట్టే మోడీ మార్క్!
భారతదేశానికి మోడీ ప్రధాన మంత్రి అయితే అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుందని ఎనిమిదేళ్ల క్రితం బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ లాల్ కృష్ణ అద్వానీ చెప్పారు.
- By CS Rao Published Date - 07:00 PM, Sat - 2 July 22

భారతదేశానికి మోడీ ప్రధాన మంత్రి అయితే అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుందని ఎనిమిదేళ్ల క్రితం బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ లాల్ కృష్ణ అద్వానీ చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిన వెంటనే ఆయన చేసిన కామెంట్ అది. ప్రస్తుతం దేశంలో అలాంటి పరిస్థితి ఉందని సర్వత్రా వినిపిస్తోన్న మాట. మునుపెన్నడూ లేనివిధంగా ఎనిమిదేళ్లలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను పడిగొట్టిన బీజేపీ తాజాగా తెలంగాణ మీద కన్నేసింది. అందుకోసం బ్లూప్రింట్ రచించడంతో పాటు దక్షిణభారతదేశంపై రాజకీయ దండయాత్రకు జాతీయ కార్యవర్గం రూట్ మ్యాప్ ప్రకటించడానికి సిద్ధం అయింది. రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండే మోడీ, షా ద్వయంతో పాటు అగ్ర నేతలు జాతీయ కార్యవర్గ సమావేశంలో చేసే తీర్మానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బ్రాహ్మణ సామాజికవర్గం పార్టీగా తొలి రోజుల్లో ముద్రపడిన బీజేపీ చాలా వరకు ఇప్పుడు బయటపడింది. మోదీ , అమిత్ షా ధ్వయం సోషల్ ఇంజనీరింగ్ దిశగా పార్టీని ముందుకు కదుపుతున్నారు. ఆ క్రమంలోనే ఆదివాసీ మహిళా రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము ఎంపిక జరిగింది. ఎన్డీయే 1 సందర్భంగా రాష్ట్రపతిగా కోవింద్‌ను ఎంపిక చేసిన దళితులకు అగ్రస్థానం ఇచ్చారు. తాజాగా ఆదివాసీ గిరిజను మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టడం సోషల్ ఇంజనీరింగ్ లోని అతి పెద్ద ముందుడుగు. హిందుత్వ పార్టీ గా బిజెపిపై ప్రపంచ దేశాల్లో ఉన్న ముద్రను చెరిపెయ్య డానికి కోవింద్ కు, ముర్ము కు పదవులు కట్ట బెడుతున్నారు.
ఆదివాశీ గిరిజనుడు సైతం భారత అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ప్రధానిగా ఎన్నుకున్నప్పుడు భారత్ లో రిజర్వేషన్లు ఎత్తివెయ్యవచ్చు అని రాజ్యాంగ రచయిత బి. ఆర్. అంబేద్కర్ సూచించారు. మరి దానికి మోదీ కట్టుబడి తగు చర్యలు తీసుకుంటారా ? అనే అనుమానం కలుగుతోంది. రిజర్వేషన్లను సమీక్షించాలని పలుమార్లు బీజేపీ నేతలు పలువురు వ్యాఖ్యానించారు. బీజేపీ రహస్య ఎజెండాలోనూ రిజర్వేషన్లపై సమీక్ష, క్రిమీలేయర్ వంటి అంశాలు ఉన్నాయని వినిపిస్తోంది. ఇప్పటికే అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ ప్రకటించిన ప్రధాని మోడీ రాబోవు రోజుల్లో రిజర్వేషన్లను సమీక్షించడానికి రాజ్యాంగబద్ధ అడుగులు వేస్తున్నారా? అనే అనుమానం రాకమానదు.
ఘర్ వాపసీ లాంటి కార్యక్రమాలను బీజేపీ సానుభూతిపరులు చేస్తున్నారు. యూపీలాంటి రాష్ట్రాల్లో మతమార్పిడులను నిషేధిస్తూ చట్టాలను తీసుకొచ్చారు. ఇదంతా చాపకిందనీరులా బలపడుతోన్న క్రిస్టియాన్టీని తగ్గించే ప్రయత్నం. అదే సమయంలో హిందూ భావజాలన్ని పెంచే వ్యూహం కూడా ఉంది. అయితే, హిందూ మతంలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ దుర్గుణాలూ ఉన్నాయి. వాటిని సరిచేసుకోవడంలో వెనుకబడింది. అప్ డేట్ అవుతున్న మతం క్రిస్టియన్ మతం. ఎప్పటికప్పుడు సమా జానికి అవసరమైన విషయాలను నర్మగర్భంగ మతంలో చర్చించి మతంలో, మత గ్రంధంలో మార్పులు చేస్తూ వస్తుంది. అలా 2 వేల సార్లు బైబిల్ లోని పదాలను మార్చడం జరిగింది. అందుకే కాలానుగుణంగా మతం కూడా నిలబడి సజీవంగా నిలబడ గల్గుతోంది. అలా మార్పులు చేసుకోవ డానికి హిందూ మతం సిద్ధం గా ఉందా ? ఉంటే లేదనే చెప్పాలి.
ఇప్పటికీ అంటరానితనం భావన నుంచి భారత సమాజం బయటపడలేదు. ప్రతి వ్యక్తి కుల, మతాలకు అతీతంగా దైవ దర్శనం, గర్భ గుడిలో సైతం ఇతర కులస్తులు పూజారులుగా ఉండే వ్యవస్థను రూపొందించు కోవాలి. అన్య మతస్తులకు సైతం దైవదర్శనం కల్పించాలి. అప్పుడే హిందూ మతం ఇతరుల్లోకి చొచ్చుకు వెళుతుంది. దేవుడు ఏ మనిషికైనా ఒకడే కదా, మరి హెచ్చు తగ్గులు చూపిస్తే ఆయన దేవుడు, దైవత్వం ఎలా అవుతుంది. ఈ చిన్న లాజిక్ ను హిందూ మతం మిస్ అవుతోంది. అందుకే మత మార్పిడులు పెరుగుతున్నాయని సామాజిక విశ్లేషకుల భావనగా ఉంది. హిందుత్వ ముద్రలో ఉన్న బీజేపీని బయటకు తీసుకురావడానికి పలు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
గుప్పెడు పెట్టుబడి దారుల కోసం 60 % పైగా ఉన్న వ్యవసాయ రంగాన్ని నడ్డి విరుస్తోందని విపక్షాల ప్రధాన ఆరోపణ. తాజాగా కేసీఆర్ కూడా అదే అంశాన్ని ఫోకస్ చేశారు .రైతులను ఉగ్రవాదులుగా, వేర్పాటు వాదులుగా మోడీ చూస్తున్నారని విమర్శలను ఎక్కుపెట్టారు. నిత్యావసరాలు, ఎరువులు, పురుగుమందుల ధరలను విపరీతంగా పెంచుతూ మోడీ విధానాలు చేస్తున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల నల్ల ధనాన్ని వెలికి తీసి లక్షల ధనాన్ని ప్రతి బ్యాంకు ఎకౌంట్ దారునికి వేస్తానని మోడీ 2014 ఎన్నికల సందర్భంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పేదలు, మధ్య తరగతి , నిరుద్యోగులు, ఉద్యోగులు అసహనంగా ఉన్న విషయాన్ని ఎత్తిచూపుతున్నారు. అవార్డ్ వాపసీ నుంచి మొన్నటి అగ్నిపథ్ వరకు వ్యతిరేకతను మోడీ సర్కార్ చవిచూసింది. అయినప్పటికీ 370 రద్దు, సీఏఏ వంటి సాహసోపేత నిర్ణయాలను తీసుకున్న పార్టీగా బీజేపీకి ప్రజాదరణ ఉందని ఆ పార్టీ విశ్వసిస్తోంది.
Gst, పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలను విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో పెట్టిన లాక్ డౌన్ విషయంలోనూ మోడీని వ్యతిరేకిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి నోట్ల రద్దు చేసిన మోడీ రూ. 2వేల నోటును తీసుకురావడం విమర్శలను ఎదుర్కొంటోంది. సహజంగా గత 65 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు ఏమి చేసాయని బిజెపి వారు తరచుగా ప్రశ్నిస్తారు. గత ప్రభుత్వాలు నెలకొల్పిన సంస్థలనే ఇప్పుడు మోడీ అమ్మడాన్ని విపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు. రెండవ సారి గద్దె నెక్కాక ఉద్యోగ నియామకాలను అగ్నిపధ్ స్కీమ్ తోటే. ప్రతి సంవత్సరం 50 వేల మంది రిటైర్ అవుతున్న సైనిక దళాల వల్ల సైన్యంలో సమతుల్యత దెబ్బతింటున్నది. అందుకే, తప్పనిసరి పరిస్థితిలో అగ్నిపధ్ ఉద్యోగ నియామకాలను మొదలు పెట్టారు. దానిలో కూడా మోదీ మార్క్ కనిపించే ప్రయత్నం వివాదం మవుతోంది.
పన్ను ఎగవేత దారులను, బ్యాంకు అప్పుల ఎగవేత దారులను రక్షించడం మోడీ మార్క్ రాజకీయమంటూ విపక్ష నేతలు స్వరం పెంచారు. అప్పటి వాజ్ పాయ్ పాలనకు భిన్నంగా ఇప్పుడు బిజెపి తో పొత్తు అంటే కొరివితో తల గోక్కున్నట్లే అనే భావనకు ప్రత్యర్థులు వచ్చేశారు. దేశ వ్యాప్తంగా రాజకీయాన్ని అనుకూలంగా మార్చుకుంటూ వస్తోన్న మోడీ, షా ద్వయం ఆధ్వర్యంలోని బిజెపి తరువాతి టార్గెట్ తెలంగాణా అని వారే చెబుతున్నారు. గతంలో అద్వానీ, వాజ్ పేయ్ ద్వయం ఎన్డీయే ప్రభుత్వాన్ని నడిపారు. కానీ, ప్రాంతీయ పార్టీల మీద దూకుడుగా వెళ్లలేకపోయారు. అందుకు భిన్నంగా మోడీ, షా ద్వయం వేగంగా అడుగులు వేస్తోంది. బహుశా అద్వానీ చెప్పిన అప్రకటిత ఎమెర్జెన్సీ అంటే ఇదేనేమో!