భర్త తనను సుఖపెట్టడం లేదని లైంగికంగా చిత్రహింసలు పెట్టిన భార్య..
- Author : Vamsi Chowdary Korata
Date : 01-04-2026 - 3:15 IST
Published By : Hashtagu Telugu Desk
Sexual Harassment Case తన భార్య తనను లైంగికంగా వేధించడంతో పాటు మోసం చేసి, బలవంతంగా ఇంట్లోంచి గెంటేశారంటూ ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వేధింపుల వెనుక అత్తింటివారి ప్రమేయం కూడా ఉందని, వారు తన వైవాహిక జీవితంలో నిరంతరం జోక్యం చేసుకుంటున్నారని 37 ఏళ్ల బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంక్లిష్టమైన వివాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే.. నగరభావికి చెందిన బాధితుడు, 31 ఏళ్ల శిల్పను బెంగళూరులో వివాహం చేసుకున్నాడు. అనంతరం జక్కూరులోని ఓ విల్లాలో కాపురం పెట్టారు. అయితే, కొద్ది రోజులకే తన అత్త ఆశా తనను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారని భర్త ఆరోపించారు. తన కుమార్తెకు మరింత మంచి సంబంధం చూస్తానని, ఆమెను వదిలేయాలని అత్త తనను రెచ్చగొట్టినట్టు ఫిర్యాదులో తెలిపారు. మామ మాధవ కృష్ణ కూడా తన ఇంటికి మనుషులను పంపించి బెదిరించారని పేర్కొన్నారు.
భార్య తన ఆర్థిక పరిస్థితిని ఎగతాళి చేస్తూ, ఆమె జీవనశైలికి తాను సరిపోనని తరచూ అవమానించేదని భర్త ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య సంపన్న స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతూ, తరచూ పార్టీలు, మద్యపానంతో విలాసవంతమైన జీవితం గడిపేదని ఆరోపించారు.
అంతేగాక భార్య తనను మానసికంగా, లైంగికంగా తీవ్ర చిత్రహింసలకు గురిచేసిందని బాధితుడు తన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు. తనకు అశ్లీల వీడియోలు పంపి, అందులో ఉన్నట్టు చేయాలని ఒత్తిడి చేసేదని తెలిపారు. తన స్నేహితురాలిని భాగస్వామిని చేసి సన్నిహితంగా ఉండాలని బలవంతం చేయడమే కాకుండా, తమ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవాలని పట్టుబట్టిందని ఆరోపించారు. తనకు గతంలో వివాహేతర సంబంధాలు ఉన్నాయని భార్యే అంగీకరించిందని పేర్కొన్నారు.
ఈ సమస్యపై 2024 జులై 4న ఇరు కుటుంబాల మధ్యవర్తిత్వంలో పంచాయితీ జరిగినా ఫలితం లేకపోయింది. 2024 సెప్టెంబర్ 24న తనను ఇంట్లో నుంచి బలవంతంగా గెంటేశారని, తన భార్యను ఆమె తల్లి చెన్నైకి తీసుకెళ్లిందని తెలిపారు. కేవలం తన యూనిఫాం, ల్యాప్‌టాప్ మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతించారని వాపోయారు.
విల్లాలో రూ. 1.87 లక్షల నగదు, 44 గ్రాముల చోకర్, 35 గ్రాముల గొలుసు, 18 గ్రాముల బ్రాస్లెట్, 11 గ్రాముల ఉంగరంతో పాటు వెండి వస్తువులు, తన పాస్‌పోర్ట్, విద్యా సర్టిఫికెట్లు వంటి కీలక పత్రాలు ఉన్నాయని, వాటిని అక్రమంగా తమ వద్ద ఉంచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ల్యాప్‌టాప్‌లోని పెళ్లి ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసి మరింత క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వస్తువులను ఇప్పించి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.
అయితే, ఈ కేసులో మరో కోణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. భర్త ఆరోపణలపై భార్య కూడా తీవ్రమైన ఎదురు ఆరోపణలు చేసినట్టు సమాచారం. తమిళనాడులో ఆమె కూడా ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఇరువర్గాల మధ్య కోర్టులో కేసు నడుస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆరోపణల్లోని వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నారు.