Tamil Nadu New Scheme: యాక్సిడెంట్ బాధితులకు హెల్ప్ చేయండి.. రివార్డు పొందండి..!
- Author : HashtagU Desk
Date : 22-03-2022 - 12:49 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడులో అధికారం చేపట్టిన తర్వాత సరికొత్త పథకాలతో ముందుకు దూసుకుపోతున్న డీఎంకే ప్రభుత్వం, తాజాగా అక్కడ మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ఎవరైనా రోడ్డు ప్రమాదానిగి గురైతే, వారికి వెంటనే వైద్య సదుపాయాలతో పాటు, సాయం చేసేవారికి, నగదు బహుమతితోపాటు సర్టిఫికేట్ కూడా ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రమాద బాధితులకు వైద్య సాయం అందేలా చేసిన వారికి, ప్రశంసా పత్రం తోపాటు 5 వేల నగదు పారితోషికం ఇస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు.
రోడ్డు ప్రమాదానికి గురైన వారిని వెంటనే సాయం చేసి.. వైద్య చికిత్సకు తరలించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో ప్రమాదాలకు గురైన వారు 48 గంటల్లో వస్తే, ఉచిత వైద్యం అందించే పథకాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో గోల్డెన్ అవర్ పేరుతో రాష్ట్రంలోని మెుత్తం 609 ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఈ పథకం అమలు అవుతుంది. అందులో భాగంగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందే బాధితులకు గరిష్టంగా లక్ష వరకు రాయితీ ఉంటుంది. ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా ఇది వర్తిస్తుంది.
సమాజంలో సేవా దృక్పథాన్ని పెంపొదించడం, మానవత్వాన్ని తట్టి లేపడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రోడ్డు మీద ఎవరికైనా ప్రమాదం జరిగితే, కొంతమంది భయంతోనో, మరేదో అవుతుందనే ఉద్దేశంతోనే, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో ప్రమాదానికి గురైన వ్యక్తుల దగ్గరకు వెళ్లరు. అతి తక్కువ మంది మాత్రమే ప్రమాద బాధితులకు సాయం చేస్తారు. అందుకే ఇప్పడు ఈ పథకం ద్వారా ప్రమాద బాధితులకు సకాలంలో సాయం అందించే వ్యక్తులకు ప్రోత్సహించినట్లు అవుతుందని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.