Hijab Row: హిజాబ్ పాలిటిక్స్.. రచ్చ లేపుతున్న ప్రియాంక “బికినీ” కామెంట్స్
- By HashtagU Desk Published Date - 03:57 PM, Wed - 9 February 22

కర్నాటకలో మొదలైన హిజాబ్ రగడ పొలిటికల్ టర్న్ తీసుకుని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న నేపధ్యంలో, విపక్షాలు కాషాయం పార్టీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహిళ తనకు ఇష్టమైన దుస్తులను ధరించే హక్కును రాజ్యాంగం కల్పించదని తెలియజేస్తూ, హిజాబ్ విషయంలో మహిళలను వేధించడం ఆపాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఒక మహిళ బికినీ వేసుకోవాలా, గుజరాతీ మహిళలు ధరించే ఘూంఘట్ (చీర కొగుతో ముసుగు) పాటించాలా, జీన్స్ వేసుకోవాలా లేక హిజాబ్ ధరించాలా అనేది ఆమె ఇష్టమని, ఎలాంటి వస్త్రాలు ధరించాలో నిర్ణయించుకునే హాక్కు సదరు మహిళకు ఉంటుందని, డ్రస్ పేరిట మహిళలను వేధించడం ఆపాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఇక ఇటీవల హిజాబ్ వివాదం పై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కూడా స్పందించిన సంగతి తెలిసిందే.
ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కర్ణాటక ఎమ్మెల్యే రేణుకాచార్య కౌంటర్ ఇచ్చారు. బికినీ అని కామెంట్ చేయడంతోనే ఆమె ఎంత దిగజారిపోయారో అర్థమవుతోందని రేణుకచార్య అన్నారు. సూళ్ళకు వెళ్ళినా, కాలేజీలకు వెళ్ళినా, ఇతర విద్యా సంస్థలకు వెళ్ళినా విద్యార్థులంతా నిండుగా బట్టలేసుకోవాల్సిన అవసరం ఉంటుందని రేణుకచార్య అన్నారు. ఇక కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో మొదలైన హిజాబ్ వివాదం, క్రమంగా చిలికిచిలికి గాలివానగా మారి, మతం రంగు పులుముకుని, కర్నాటక రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా పాకింది. విద్యార్థులు రెండు వర్గాలుగా చీలిపోయి, పెద్ద ఎత్తున గొడవలు చేస్తుండడంతో కర్నాటకలో స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించిన సంగతి తెలిసిందే.