The Kerala Story : మణిపూర్ మండుతుంటే .. సినిమాను మోడీ ప్రమోట్ చేస్తున్నారు : అసద్
జమ్మూకశ్మీర్‌లో సైనికులను ఉగ్రవాదులు హతమారుస్తుంటే, మణిపూర్ హింసాకాండలో మండిపోతుంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం కర్ణాటక ఎన్నికల్లో డర్టీ పిక్చర్ (The Kerala Story)ని ప్రమోట్ చేస్తున్నారని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఆరోపించారు.
- Author : Pasha
Date : 06-05-2023 - 5:06 IST
Published By : Hashtagu Telugu Desk
బెంగళూరు : జమ్మూకశ్మీర్‌లో సైనికులను ఉగ్రవాదులు హతమారుస్తుంటే, మణిపూర్ హింసాకాండలో మండిపోతుంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం కర్ణాటక ఎన్నికల్లో డర్టీ పిక్చర్ (The Kerala Story)ని ప్రమోట్ చేస్తున్నారని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఆరోపించారు. మణిపూర్ లో ప్రజలు ఇళ్లను వదిలి పారిపోయేంత దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి కాశ్మీర్ లో మన ఐదుగురు సైనికులను చంపేశారని పేర్కొన్నారు. “కేరళ కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్రను బట్టబయలు చేసేలా ది కేరళ స్టోరీ మూవీని రూపొందించారు” అని ఇటీవల బళ్లారిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ అన్నారు. దీనికి కౌంటర్ గా శనివారం అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. “అదొక తప్పుడు సినిమా. అందులో బురఖాను చూపించి డబ్బులు సంపాదించుకోవాలనే లక్ష్యమే కనిపిస్తోంది” అన్నారు.
also read : The Kerala Story: పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న ‘ది కేరళ స్టోరీ’
“ప్రధాని మోడీజీ.. పాకిస్తాన్ ను అడ్డుకుంటామంటూ స్పీచ్ లు ఇచ్చి మీరు సరిపెట్టుకోకండి.. వాళ్ళు వచ్చి మన సైనికులను చంపకుండా అడ్డుకునే ఏర్పాట్లు కూడా చేయండి. జాతీయవాదంపై ఎన్నికల వేళ ప్రసంగాలు దంచికొట్టే ప్రధాని మోడీ .. మన సైనికులు అమరులైనప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోతున్నారని అసదుద్దీన్ వ్యంగ్యంగా అన్నారు. ” ప్రధాని విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపొందడం కోసమే ఆయన ఇంతగా దిగజారారు” అని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బజరంగ్ దళ్, బజరంగ్ బలి, ది కేరళ స్టోరీ (The Kerala Story)లను కూడా వాడుకుంటున్నారని గుర్తు చేశారు.