బెంగాలీ మహిళలు ఎక్కువగా ఎరుపు- తెలుపు రంగుల చీరలు ఎందుకు కట్టుకుంటారో తెలుసా?!
పాత కాలంలో బెంగాల్‌లో నూలు (Cotton) వస్త్రాల లభ్యత ఎక్కువగా ఉండేది. కాటన్ వస్త్రంపై ఎరుపు రంగు అంచును వేయడం ఆ కాలంలో సులభంగా ఉండేది.
- Author : Gopichand
Date : 10-01-2026 - 10:38 IST
Published By : Hashtagu Telugu Desk
Red- White Sarees: మహిళలకు అత్యంత ఇష్టమైన వస్త్రధారణ చీర. శుభకార్యాలన్నా, పండుగలన్నా మెజారిటీ మహిళలు చీర కట్టుకోవడానికే మొగ్గు చూపుతారు. అయితే బెంగాల్ సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు మన కళ్ల ముందు మెదిలే మొదటి రూపం ‘ఎర్రటి అంచు ఉన్న తెల్లటి చీర’. బెంగాలీ పండుగల్లో మహిళలందరూ దాదాపుగా ఇవే రంగుల చీరల్లో కనిపిస్తారు. మరి బెంగాలీ మహిళలు ఎరుపు, తెలుపు రంగు చీరలకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు? దీని వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎరుపు- తెలుపు రంగుల వెనుక పరమార్థం
బెంగాలీ సంస్కృతిలో ఎరుపు- తెలుపు రంగులను అత్యంత శుభప్రదంగా భావిస్తారు. తెలుపు రంగు శాంతి, పవిత్రతకు చిహ్నం అయితే ఎరుపు రంగు శక్తి, ఉత్సాహం, అదృష్టానికి గుర్తు. ఈ రంగులు మనిషి జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అక్కడి ప్రజల నమ్మకం.
Also Read: భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మంత్రి వాసంశెట్టి సుభాష్
దుర్గా పూజతో ఉన్న అనుబంధం
ఈ రంగుల కలయికకు దుర్గా పూజతో విడదీయలేని సంబంధం ఉంది. దుర్గామాతకు ఎరుపు, తెలుపు రంగులంటే చాలా ఇష్టమని భక్తుల నమ్మకం. అందుకే పండుగ రోజుల్లో మహిళలు ఈ రంగు చీరలు ధరించి అమ్మవారిని పూజిస్తారు. ఇలా చేయడం ద్వారా వారు అమ్మవారి స్వరూపాన్ని గౌరవించడమే కాకుండా, తమ జీవితాల్లో సుఖశాంతులు కలగాలని కోరుకుంటారు.
సింధూర్ ఖేలా సంప్రదాయం
దుర్గా పూజ చివరి రోజున ‘సింధూర్ ఖేలా’ వేడుక జరుగుతుంది. బెంగాలీ ముత్తైదువులకు ఇది చాలా ప్రత్యేకమైన ఆచారం. ఈ రోజున వారు ఎర్రటి అంచు ఉన్న తెల్లటి చీరలు (దీనిని ‘లాల్ పర్ శారీ’ అంటారు) ధరించి, ఒకరికొకరు సింధూరం పూసుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని, దంపతుల మధ్య ప్రేమ, శాంతి వెల్లివిరుస్తాయని వారు నమ్ముతారు.
చారిత్రక- భౌగోళిక కారణం
పాత కాలంలో బెంగాల్‌లో నూలు (Cotton) వస్త్రాల లభ్యత ఎక్కువగా ఉండేది. కాటన్ వస్త్రంపై ఎరుపు రంగు అంచును వేయడం ఆ కాలంలో సులభంగా ఉండేది. నాణ్యమైన, సౌకర్యవంతమైన కాటన్ చీరలు తక్కువ ధరకే అందుబాటులోకి రావడంతో, ఈ శైలి బెంగాలీ సంస్కృతిలో ఒక భాగమైపోయింది.