భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మంత్రి వాసంశెట్టి సుభాష్
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ బుక్స్‌లో 99 శాతం మంది భక్తులు సానుకూల స్పందన ఇచ్చారని మంత్రి తెలిపారు.
- Author : Gopichand
Date : 10-01-2026 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
Minister Vasamsetti Subhash: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ ముష్కర మూకలు కుట్రలు పన్నుతున్నాయని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా మండిపడ్డారు. శనివారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ భక్తులను ఆందోళనకు గురిచేయడం వైసీపీ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు.
వ్యాపార కేంద్రంగా టీటీడీని మార్చిన వైసీపీ
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలను ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారని మంత్రి విమర్శించారు. దేవుడంటే భయం, భక్తి లేని వ్యక్తులను టీటీడీ చైర్మన్లుగా నియమించి, దర్శనాలను కమర్షియల్ చేశారని ఆరోపించారు. “గతంలో 30-40 మందిని వెంటేసుకుని డబ్బులు వసూలు చేస్తూ దర్శనాలకు తీసుకెళ్లడం బహిరంగ రహస్యం. కానీ చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టాక, వీఐపీ దర్శనాలను తగ్గించి సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు” అని స్పష్టం చేశారు.
Also Read: రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ వైద్యం!
వైకుంఠ ఏకాదశిపై దుష్ప్రచారం
ఇటీవల ముక్కోటి ఏకాదశి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చినా, ఎక్కడా చిన్న అపశృతి లేకుండా ప్రశాంతంగా ఉత్తర ద్వార దర్శనం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. అయితే, ఏదో ఒక చిన్న ఫోటోను పట్టుకుని తొక్కిసలాట జరుగుతోందంటూ వైసీపీ అనుబంధ మీడియా భయాందోళనలు సృష్టించడం సిగ్గుచేటన్నారు. తిరుమలలో ఉద్దేశపూర్వకంగా ఖాళీ బాటిళ్లు వేయించి, సాక్షి విలేకరులతో తప్పుడు వార్తలు రాయించి, ఆపై భూమన అనుచరులు ఏడుపు ముఖాలతో ప్రెస్‌మీట్లు పెట్టడం వారి కుట్రలో భాగమేనని ఆరోపించారు.
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను మంత్రి ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. లడ్డూ ప్రసాదం, కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణలో బంగారం, నగదు సీజ్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. తలనీలాల స్కామ్, పరాకామణి దోపిడీ వంటి ఘటనలు వైసీపీ పాలనలోనే జరిగాయని, కోట్ల విలువైన తలనీలాలు విదేశాలకు తరలించిన కేసులు ఉన్నాయని తెలిపారు. బంగారు చీరల వ్యవహారం, రథాల నిర్మాణం పేరుతో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగుతోందని చెప్పారు.
కూటమి ప్రభుత్వంలో భక్తుల సంతృప్తి
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ బుక్స్‌లో 99 శాతం మంది భక్తులు సానుకూల స్పందన ఇచ్చారని మంత్రి తెలిపారు. విజయవాడ దుర్గమ్మ ఆలయానికి 16 లక్షల మంది వచ్చినా వీఐపీ సిఫార్సులను తగ్గించడం వల్లే సామాన్యులకు ప్రశాంత దర్శనం కలిగిందన్నారు. సీసీ కెమెరాలు, జియో ట్యాగింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతతో కుట్రకారులను క్షణాల్లో పట్టుకుంటామని హెచ్చరించారు.