Global Investors Summit : భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం ఆశాభావం: ప్రధాని
20 సంవత్సరాలకు ముందు ఇక్కడికి రావాలంటే పెట్టుబడిదారులు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు పెట్టుబడుల పరంగా ముందువరుసలో ఉంది.
- By Latha Suma Published Date - 01:16 PM, Mon - 24 February 25

Global Investors Summit : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరుగుతోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ఆర్థికరంగంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు చెప్పిందని గుర్తుచేశారు. భారత్ మాటలకే పరిమితం కావడం లేదని, చేతల్లోను చూపిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. 20 సంవత్సరాలకు ముందు ఇక్కడికి రావాలంటే పెట్టుబడిదారులు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు పెట్టుబడుల పరంగా ముందువరుసలో ఉంది.
Read Also: AP Assembly : ప్రజల గొంతుకను వినిపించేది ప్రతిపక్షమే : బొత్స
సౌరశక్తిలో భారత్ సూపర్ పవర్‌గా మారిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ విభాగం కీర్తించింది. ఇతర దేశాలు మాటలతో ఆగిపోతుంటే.. భారత్ చెప్పింది చేసి చూపించిందని ఆ సంస్థే పేర్కొంది. ఈ వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి అని ప్రధాని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం ఆశాభావంతో ఉందని మోదీ అన్నారు. జనాభాపరంగా మధ్యప్రదేశ్ ఐదో అతిపెద్ద రాష్ట్రం. వ్యవసాయం, ఖనిజాల పరంగా ముందువరుసలో ఉంది. రెండు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలనపై దృష్టిసారించిందని ప్రధాని తెలిపారు. కాగా, మంగళవారం కూడా ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. దీనికి 60 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఆయా దేశాల దౌత్యవేత్తలు పాల్గొన్నారు. భారత వ్యాపార రంగ ప్రముఖులు కుమార్ మంగళంబిర్లా, గౌతమ్ అదానీ, నాదిర్ గోద్రెజ్ తదితరులు హాజరయ్యారు.
మరోవైపు ఈ సమ్మిట్‌లో ప్రధాని మోడీ లేటుగా వచ్చారు. దీంతో సదస్సులో పాల్గొన్న వారికి క్షమాపణలు తెలియజేశారు. తాను ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని ప్రధాని వివరించారు. 10, 12 తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్ష ప్రారంభమయ్యే సమయం.. నేను రాజ్‌భవన్ నుంచి బయల్దేరే సమయం ఒకటే. అయితే అదే సమయంలో నేను వస్తే భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ జామ్ కావొచ్చు. దీంతో విద్యార్థులు ఇబ్బందిపడే అవకాశం ఉంది. అందుకే వారంతా పరీక్షా కేంద్రాలకు వెళ్లిన తర్వాత రాజ్‌భవన్ నుంచి బయల్దేరాలనుకున్నాను. దీంతో 15-20 నిమిషాలు ఆలస్యమైంది. ఇక్కడ మీకు అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నాను అని ప్రధాని మోడీ చెప్పారు.