Women’s Reservation Bill : 2027 తర్వాతే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు..!
వినాయకచవితి సందర్బంగా మంగళవారం లోక్ సభలో బిజెపి సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill)ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
- By Sudheer Published Date - 11:00 AM, Wed - 20 September 23

వినాయకచవితి సందర్బంగా మంగళవారం లోక్ సభలో బిజెపి సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill)ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు అమ్మల్లోకి రావాలంటే పలు అడ్డంకులు దాటాల్సి ఉంటుంది. అవన్నీ దాటాలంటే మరికొన్ని ఏళ్లు ఎదురుచూడకతప్పదు. 35 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహిళాబిల్లును లోక్‌సభలో కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టింది. దీనిపై నేడు బుధవారం 7 గంటలపాటు చర్చ జరుగనున్నది. ఈ బిల్లు కు ప్రతి ఒక్కరు ఆమోదం తెలుపుతుండడం తో మహిళా బిల్లు ఆమోదం ఖాయంగా కనిపిస్తున్నది.
కాగా ఈ బిల్లు ఫై నేడు కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ (Sonia Gandhi) చర్చను ప్రారంభించనున్నారు. గతంలో మన్మోహన్ సర్కార్ 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో పాస్ చేసింది. అయితే, లోక్‌సభలో మాత్రం బిల్లు వీగిపోయింది. దీంతో మరోసారి బిజెపి సర్కార్ మంగళవారం నాడు ఈ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘవాల్ ప్రవేశపెడుతూ కీలక విషయాలు తెలిపారు. ‘ఈ బిల్లు మహిళా సాధికారతకు సంబంధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AAను సవరించడం ద్వారా ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతం (NCT)లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేయబడతాయి. ఆర్టికల్ 330A రిజర్వేషన్లు హౌస్ ఆఫ్ పీపుల్‌లో SC/ST కోసం సీట్లు కేటాయించడం జరుగుతుంది’ అని చెప్పుకొచ్చారు. నేడు ఈ బిల్లు ఫై చర్చ జరుగుతుంది. రేపు రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు.
బుధువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశమైన తర్వాత ఈ బిల్లు (Women’s Reservation Bill)పై చర్చించనున్నది. బీజేపీ తరపున ఈ బిల్లుపై నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, భారతి పవార్, అపరాజిత్ సారంగి, సునితా దుగ్గల్, దియా కుమారి మాట్లాడనున్నారు. మహిళా బిల్లుకు ప్రస్తుతం ఉభయసభల ఆమోదం లభించినా, చట్టసభల్లో మహిళలకు వెంటనే 33% రిజర్వేషన్ సాధ్యం కాదని తెలుస్తున్నది. 2027 తర్వాతే ఈ చట్టం సంపూర్ణంగా అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాక మహిళా చట్టం అమల్లోకి వస్తుందని బిల్లులో స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలంటే జనగణన జరగాలి. 2021లోనే జనగణన జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 2026లో జనగణన, ఆ మరుసటి ఏడాది డీలిమిటేషన్ చేపట్టనున్నారు.
గతంలో మన్మోహన్ సర్కార్ చేపట్టిన మహిళా బిల్లుకు..ఇప్పుడు ప్రవేశ పెట్టిన మహిళా బిల్లుకు మధ్య కొత్త రాజ్యాంగ సవరణలను చేయడం జరిగింది.
Read Also : New Farmer Schemes: గుడ్ న్యూస్.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు..!
2010 బిల్లు (Women’s Reservation Bill) విషయానికి వస్తే..
- చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు- 2008 ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీలో మహిళలకు మూడింట ఒకవంతు సీట్లను కేటాయించాలి.
- ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే మొత్తం సీట్లలో నుంచి మూడింట ఒక వంతు సీట్లను ఆయావర్గాలకు చెందిన మహిళలకు కేటాయించాలి.
- లోక్‌సభ, అసెంబ్లీలకు ఇది వర్తిస్తుంది. రాష్ర్టాలు, యూటీల్లో రొటేషన్ ప్రకారం రిజర్వ్‌డ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
- చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రొటేషన్ ప్రకారం మూడు దఫాలుగా అన్ని స్థానాలకు వర్తించే విధంగా 15 సంవత్సరాల కాల పరిమితితో ఈ రిజర్వ్‌డ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
- ఒకేసీటు ఉన్న యూటీలో ప్రతీ మూడో విడత ఎన్నికల్లో ఆ సీటు మహిళలకు కేటాయించాలి. లోక్‌సభలో ఆంగ్లో-ఇండియన్ల రెండు సీట్ల విషయంలోనూ ప్రతీ మూడు ఎన్నికల్లో వరుసగా జరిగే రెండు ఎన్నికల్లో ఒక్క సీటును మహిళలకు కేటాయించాలి.
- 15 ఏండ్ల కాలపరిమితిలో ఒకసారి రిజర్వ్ చేసిన సీటును మళ్లీ రిపీట్ చేయకూడదు.
2023 బిల్లు విషయానికి వస్తే..
- 2023 లో (128వ రాజ్యాంగం సవరణ బిల్లు) ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీలో మహిళలకు మూడింట ఒకవంతు సీట్లను కేటాయించాలి. ఆర్టికల్ 330 ఏ ప్రకారం ఈ సూత్రం వర్తిస్తుంది.
- ఆర్టికల్ 239 ఏఏ ప్రకారం.. ఢిల్లీ అసెంబ్లీకి కూడా మహిళలకు మూడింట ఒకవంతు సీట్ల నియమం వర్తిస్తుంది.
- లోక్‌సభ, అసెంబ్లీలకు ఈ రిజర్వ్‌డ్ సీట్ల కేటాయింపును పార్లమెంట్ నియమించిన అథారిటీ నిర్ణయిస్తుంది.
- ఎస్సీ, ఎస్టీల సీట్లలో నుంచి మూడింట ఒక వంతు సీట్లను ఆయా వర్గాలకు చెందిన మహిళలకు కేటాయించాలి.
- ఆర్టికల్ 334 ఏ ప్రకారం.. నియోజక వర్గాల పునర్విభజన పూర్తయ్యాకనే చట్టం అమల్లోకి వస్తుంది.
- రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ల్లో రొటేషన్ ప్రకారం వివిధ నియోజకవర్గాలకు రిజర్వ్‌డ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
- ఈ మహిళా రిజర్వేషన్లు రాజ్యసభ, రాష్ర్టాల్లోని శాసన మండళ్లకు వర్తించవు.
- ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఈ బిల్లులో పొందుపరచలేదు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రొటేషన్ ప్రకారం మూడు దఫాలుగా అన్ని స్థానాలకు
- వర్తించే విధంగా 15 సంవత్సరాల కాల పరిమితితో ఈ రిజర్వ్‌డ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. తదుపరి వీటిని పెంచుకునే అవకాశం ఉన్నది.
- 15 ఏండ్ల కాలపరిమితిలో ఒకసారి రిజర్వ్‌చేసిన సీటును మళ్లీ రిపీట్ చేయకూడదు. రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత 15 ఏండ్లపాటు ఈ విధానం అమల్లో ఉండనున్నది.
మహిళా బిల్లుకు రాష్ర్టాల శాసనసభల ఆమోదం కూడా తప్పనిసరి. ఈ అంశం రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉండటంతో దేశంలోని మొత్తం రాష్ర్టాల్లో కనీసం సగం అంటే 14 రాష్ర్టాల అసెంబ్లీలు ఈ బిల్లును ఆమోదించాలి. ఇలా కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన బిల్లు కు , బిజెపి తీసుకొచ్చిన బిల్లు కు మధ్య పలు సవరణలు జరిగాయి. ఇదిలా ఉంటె మహిళా రిజర్వేషన్ బిల్లుపై క్రెడిట్ తమదంటే తమదని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కొట్లాడుకుంటున్నాయని బిఆర్ఎస్ అంటుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్.. గత రెండు పర్యాయాలుగా అధికారం వెలగబెడుతున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ చిత్తశుద్ధి ఏపాటిదో చరిత్ర చెబుతుందని వారు సెటైర్లు వేస్తున్నారు.