PM Candidate : ‘ప్రధానిగా ఎవరైతే బెటర్ ?’.. ఒపీనియన్ పోల్‌లో ఆసక్తికర విశేషాలు
- Author : Pasha
Date : 15-04-2024 - 9:25 IST
Published By : Hashtagu Telugu Desk
PM Candidate : ‘‘దేశ ప్రధానిగా ఈసారి ఎవరైతే బాగుంటుంది ?’’ అనే దానిపై ప్రజల అభిప్రాయాలను ABP CVoter సేకరించింది. ఈ ఒపీనియన్ పోల్‌లో పాల్గొన్న వారిలో 58 శాతం మంది ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా మాట్లాడారు. ఆయనే మళ్లీ పీఎం అయితే బాగుంటుందని చెప్పారు. ఇక 16 శాతం మంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రధానిగా ఉండడానికి అర్హుడే అని చెప్పారు. రాహుల్ గాంధీ వ్యక్తిత్వం, సహన శీలత, స్నేహభావం, మానవత్వం గొప్పలక్షణాలని ఈ సర్వేలో పాల్గొన్న వారు కొనియాడారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 2.4 శాతం మంది ప్రధాని పదవికి అరవింద్ కేజ్రీవాల్ కూడా సరైన వ్యక్తే అని చెప్పారు. ప్రధాని పోస్టు విషయంలో 1.6 శాతం మంది ఓటర్లు మమతా బెనర్జీకి, 1.5 శాతం మంది ఓటర్లు అఖిలేష్ యాదవ్‌కు అనుకూలంగా సమాధానం చెప్పారు. పీఎం అభ్యర్థి విషయంలో 11.1 శాతం మంది ఇతరుల పేర్లు చెప్పగా.. 8.2 శాతం మంది ఈవిషయంలో తాము ఏదీ చెప్పలేమని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి 9వ తేదీ వరకూ దాదాపు 2,600 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించి ఈ ఒపీనియన్ పోల్ ఫలితాలను విడుదల చేశారు.
We’re now on WhatsApp. Click to Join
నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలలో ఎవరినైనా ఒకరిని నేరుగా ఎన్నుకోవాల్సి వస్తే.. ఎవరికి ఓటు వేస్తారన్న కోణంలోనూ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేలో సేకరించారు. ఈ రకమైన ప్రశ్నను ఎదుర్కొన్న వారిలో 62.4 శాతం మంది ప్రధాని మోడీ(PM Candidate) వైపే మొగ్గుచూపారు. ఆయననే పీఎంగా ఎన్నుకుంటామని తేల్చి చెప్పారు. మరో 28 శాతం మంది రాహుల్ పీఎం అయితే బెటర్ అని చెప్పారు. ఇంకొన్ని రోజుల్లో(ఏప్రిల్ 19 నుంచి) లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మొదలవుతున్న తరుణంలో ఈ ఒపీనియన్ పోల్ ఫలితాలు యావత్ ఉత్తరాదిలో సంచలనం క్రియేట్ చేశాయి.
Also Read : Last Date : వజ్రాయుధం కోసం అప్లై చేసుకోండి.. ఇవాళే లాస్ట్ డేట్
సర్వేలో పాల్గొన్నవారు ఏమేం చెప్పారంటే..
- 47.5 శాతం మంది తమ జీవితాలు ఎంతో మెరుగయ్యాయని తెలిపారు.
- దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో నిరుద్యోగం చాలా కీలకమైందని 31.9 శాతం మంది ఓటర్లు తెలిపారు.
- సర్వేలో పాల్గొన్న ఓటర్లలో 23.6 శాతం మంది భారత్ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని చెప్పారు.
- 23.1 శాతం మంది ఓటర్లు ధరల మంట, అల్ప ఆదాయం, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్టు పేర్కొన్నారు.
- 21.8 శాతం మంది తమ జీవితాలు ఏమీ బాగుపడలేదని, ప్రభుత్వం కూడా సమస్యల్లోనే ఉందని చెప్పారు.
- 11.8 శాతం మంది ఓటర్లు తమ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేయాలని అభిప్రాయపడ్డారు.
- 11.1 శాతం మంది ఓటర్లు ప్రధాని మోడీ పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
- 4.3 శాతం మంది తాము బాగానే ఉన్నప్పటికీ భారత్ ఇంకా పేదరికంలోనే ఉండిపోతోందని అసహనం వ్యక్తం చేశారు.