David Headley : తహవ్వుర్‌ను తీసుకొచ్చారు.. డేవిడ్ హెడ్లీ సంగతేంటి ? అతడెవరు ?
ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ(David Headley) పూర్తి పేరు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ. ఇతడి అసలు దావూద్ సయ్యద్ గిలానీ.
- By Pasha Published Date - 03:51 PM, Thu - 10 April 25

David Headley : 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవ్వుర్ రాణా ఎట్టకేలకు భారత్‌కు చేరాడు. అమెరికాతో మోదీ సర్కారు నెరిపిన దౌత్యం విజయవంతం అయింది కాబట్టే.. తహవ్వుర్ రాణా అప్పగింత ప్రక్రియ పూర్తయింది. ఇక భారత్ తదుపరి లక్ష్యంలో డేవిడ్ హెడ్లీ ఉన్నాడు. ఇతగాడు కూడా ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి. డేవిడ్ హెడ్లీ కూడా ప్రస్తుతం అమెరికా జైలులోనే ఉన్నాడు. అయితే రాణాను అప్పగించినంత ఈజీగా హెడ్లీని అప్పగించేందుకు అమెరికా కావడం లేదట. ఇంతకీ ఎందుకో తెలుసుకుందాం..
Also Read :EX MLA Shakeel : పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే షకీల్.. ఎందుకు ?
డేవిడ్ హెడ్లీ.. పినతల్లితో సంబంధం.. ఏమైందంటే..
- ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ(David Headley) పూర్తి పేరు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ. ఇతడి అసలు దావూద్ సయ్యద్ గిలానీ.
- పాకిస్తాన్ సంతతికి చెందిన ఇతగాడు 1960 జూన్ 30న అమెరికాలోని వాషింగ్టన్‌లో జన్మించాడు. అయితే ఆ తర్వాత అతడి కుటుంబం పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లిపోయింది.
- 1970వ దశకంలో స్కూల్ డేస్‌లోనే పాకిస్తాన్‌లోని హసన్ అబ్దల్ నగరంలో తహవ్వుర్ రాణాతో డేవిడ్ హెడ్లీకి పరిచయం ఏర్పడింది.
- 1977లో 17 ఏళ్ల వయసులో డేవిడ్ హెడ్లీ తన పినతల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయంపై కుటుంబంలో గొడవ జరగడంతో పాక్ వదిలి అమెరికాకు వెళ్లిపోయాడు.
- అమెరికాలో పబ్‌లు, వైన్ షాపులను హెడ్లీ నడిపాడు. ఆ సమయంలోనే అమెరికా ప్రభుత్వ డ్రగ్స్ నిరోధక విభాగానికి ఇన్ఫార్మర్‌గా పనిచేశాడు. పాకిస్తాన్ నుంచి అమెరికాకు వచ్చే డ్రగ్స్‌పై సమాచారాన్ని సేకరించి అందించేవాడు.
- పలుమార్లు డేవిడ్ హెడ్లీ పాకిస్తాన్‌లో పర్యటించి అక్కడి జిహాదీ సంస్థలతో సంబంధాలను ఏర్పర్చుకున్నాడు.
- 2008 ముంబై ఉగ్రదాడి కోసం పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా ప్లాన్ చేశాక..డేవిడ్ హెడ్లీ కూడా సహాయ సహకారాలను అందించాడు.
- ఉగ్రదాడికి ముందు డేవిడ్ హెడ్లీ ముంబై నగరంలో దాదాపు 8 సార్లు రెక్కీ నిర్వహించాడు. స్థానికంగా కొందరు ఇన్ఫార్మర్లను తయారు చేసుకున్నాడు. వారి నుంచి నిఘా సమాచారాన్ని సేకరించి లష్కరే తైబాకు చేరవేశాడు. దీని ప్రకారమే ఉగ్రదాడి జరిగింది.
- ముంబైకి వచ్చి రెక్కీ నిర్వహించినప్పుడల్లా డేవిడ్ హెడ్లీ.. తహవ్వుర్ రాణాకు పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ చేసేవాడట. ముంబై నగరానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పేవాడట. ఉగ్రదాడి ఎలా చేస్తే బాగుంటుందనే సలహాలను ఇచ్చేవాడట.
- డెన్మార్క్‌లోని కోపెన్ హగెన్‌లో ఉగ్రదాడి ప్రయత్నం వెనుక కూడా హెడ్లీ హస్తం ఉంది.
- 2009 అక్టోబరులో పాకిస్తాన్‌కు వెళ్తుండగా అమెరికాలోని చికాగో ఎయిర్‌పోర్టులో హెడ్లీ, తహవ్వుర్ రాణాలను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
అమెరికా అప్పగించదా .. ఎందుకు ?
డేవిడ్ కోల్మన్ హెడ్లీని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుముఖంగా లేదని తెలుస్తోంది. అందుకు కొన్ని చట్ట, దౌత్య, వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. తనను భారత్, పాక్, డెన్మార్క్‌కు అప్పగించొద్దని 2010లోనే అమెరికా అధికారులతో హెడ్లీ ఒక ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా, పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అమెరికాకు అందించేందుకు హెడ్లీ అంగీకరించాడట. ఇందుకు ప్రతిగా భారత్, పాక్, డెన్మార్క్‌లకు తనను అప్పగించొద్దని అమెరికా దర్యాప్తు సంస్థలను హెడ్లీ వేడుకున్నాడట. అందుకే అతడిని తమ దేశంలోనే ఉంచుకోవాలని అమెరికా భావిస్తోందట.