EX MLA Shakeel : పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే షకీల్.. ఎందుకు ?
షకీల్(EX MLA Shakeel) కుమారుడు సాహిల్ గతంలో కారును వేగంగా నడుపుతూ హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టారు.
- By Pasha Published Date - 01:33 PM, Thu - 10 April 25

EX MLA Shakeel : బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నారు. గత కొన్ని నెలలుగా దుబాయ్‌లో ఉంటున్న షకీల్.. తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. షకీల్ వస్తున్నట్లుగా.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో అక్కడ ముందస్తుగా పోలీసు పహారాను పెంచారు. విమానం దిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి షకీల్ చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మానవతా కోణంలో తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్‌ను పోలీసు శాఖ అనుమతించింది. ఆ తర్వాత షకీల్‌ను విచారించే అవకాశముంది.
Also Read :Kalvakuntla Kavitha: బీసీ ఎజెండా.. జాగృతి కండువా.. కవిత ప్లాన్ ఏమిటి ?
ఎందుకు అదుపులోకి తీసుకున్నారు ?
గత ఏడాది షకీల్(EX MLA Shakeel) కుమారుడు సాహిల్ మద్యం మత్తులో కారును వేగంగా నడుపుతూ హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టారు. ఈ కేసు నుంచి తన కుమారుడిని తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే యత్నించారనే ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలో ఆ నేరాన్ని డ్రైవర్‌పైకి నెట్టారు. ఈ కేసును విచారించే క్రమంలో.. అంతకుముందు జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడి మరణానికి కూడా షకీల్ కుమారుడే కారణమని తేలింది. ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను సాహిల్ ఢీకొట్టిన ఘటన 2023 డిసెంబరు 23న చోటుచేసుకోగా.. చాలా ఆలస్యంగా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో షకీల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో పంజాగుట్ట పోలీసు స్టేషనులో పనిచేసిన మొత్తం సిబ్బందిపై వేటు పడింది. వారందరినీ ఇతర పోలీసు స్టేషన్లకు బదిలీ చేశారు.
Also Read :HSRP Features: ఏమిటీ.. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ? ఫీచర్స్ ఏమిటి ?
లుకౌట్ నోటీసుల వల్లే..
అయితే కేసు నమోదైన వెంటనే షకీల్ దుబాయ్‌కు పరారయ్యారు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అవి భారత దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులకు చేరాయి. షకీల్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న సమాచారాన్ని ముందస్తుగా తమకు తెలియజేయాలని దేశంలోని అన్ని విమానాశ్రయాలను తెలంగాణ పోలీసులు కోరారు. అందువల్లే ఇవాళ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు షకీల్ చేరగానే పోలీసులు పట్టుకోగలిగారు.