Yogi Adityanath : సీఎం యోగికి ఎదురుగాలి.. యూపీ ప్రభుత్వంలో లుకలుకలు
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవమైన ప్రదర్శనను కనబర్చింది.
- By Pasha Published Date - 02:17 PM, Wed - 17 July 24

Yogi Adityanath : లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవమైన ప్రదర్శనను కనబర్చింది. ఈనేపథ్యంలో అక్కడి బీజేపీ సర్కారులో లుకలుకలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు మధ్య బేదాభిప్రాయాలు ఏర్పడ్డాయంటూ కథనాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేశవ్‌ప్రసాద్ ఢిల్లీలో దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో యూపీలోని 10 అసెంబ్లీ స్థానాల్లో జరగనున్న బైపోల్స్‌పై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. యూపీ సీఎంను మార్చడంపై డిస్కషన్ జరగలేదని అంటున్నారు. యూపీలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో నడ్డాతో కేశవ్(, Keshav Prasad Maurya) సమావేశం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి కూడా నడ్డాతో విడిగా సమావేశం కావడం గమనార్హం. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను తొలగించే దిశగా పనిచేయాలని భూపేంద్ర చౌదరికి నడ్డా సూచించినట్లు తెలిసింది.
We’re now on WhatsApp. Click to Join
యూపీ బై పోల్స్ తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. సీఎం యోగి పనితీరును ప్రామాణికంగా తీసుకొని.. మంత్రి వర్గంలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అతి విశ్వాసం వల్లే గత లోక్‌సభ ఎన్నికల్లో నష్టపోయామని ఇటీవలే సీఎం యోగి చేసిన కామెంట్‌పైనా పార్టీపెద్దలు విస్మయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ లక్ష్యంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. బీజేపీలో అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరాయని ఆయన విమర్శించారు. సొంత పార్టీనే పాలించుకోలేని బీజేపీ.. యూపీని ఎలా పాలించగలదని వ్యాఖ్యానించారు. బీజేపీలో అధికార పీఠం కోసం పోరు ఎలా జరుగుతుందో ప్రజలంతా గమనించాలని అఖిలేష్ కోరారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ఈ తరహా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుండటం ఇదే తొలిసారి.