Militants Bunkers Destroyed : మణిపూర్‌లో ఆర్మీ ఆపరేషన్.. ఉగ్రవాదుల బంకర్లు ధ్వంసం
మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లా ముల్సాంగ్, లైకా ముల్‌సౌ గ్రామాల్లో నిర్వహించిన సైనిక ఆపరేషన్‌లో ఉగ్రవాదులకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం(Militants Bunkers Destroyed) చేశాయి.
- Author : Pasha
Date : 07-09-2024 - 10:49 IST
Published By : Hashtagu Telugu Desk
Militants Bunkers Destroyed : మణిపూర్‌లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలకు భారత భద్రతా బలగాలు ధీటైన సమాధానం ఇచ్చాయి. ఇటీవలే ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని భద్రతా బలగాల స్థావరాలపై ఉగ్రవాదులు డ్రోన్లతో బాంబు దాడులకు పాల్పడ్డారు. వాటిని మర్చిపోకముందే బిష్ణుపూర్ జిల్లాలో ఉగ్రవాదులు రెండు రాకెట్లతో జరిపిన దాడిలో ఒక వ్యక్తి చనిపోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలను సీరియస్‌గా పరిగణించిన కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. దీంతో మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లా ముల్సాంగ్, లైకా ముల్‌సౌ గ్రామాల్లో నిర్వహించిన సైనిక ఆపరేషన్‌లో ఉగ్రవాదులకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం(Militants Bunkers Destroyed) చేశాయి. పోలీసు బృందాలు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఆయా గ్రామాల్లోని కొండల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ముల్సాంగ్ గ్రామంలోని రెండు బంకర్లను, చురచంద్‌పూర్‌లోని లైకా ముల్‌సౌ గ్రామంలో ఒక బంకర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో స్వయంగా బిష్ణుపూర్ ఎస్పీ, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ నిర్వహించే క్రమంలో ఆయా బంకర్ల ఏరియాలో ఉన్న అనుమానిత ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసు బృందం ప్రతికాల్పులు జరిపి వారిని తిప్పికొట్టింది.
Also Read :Musharrafs Family Property : భారత్‌లో ముషారఫ్ ఆస్తులు.. వేలం వేస్తే ఎంత వచ్చాయో తెలుసా ?
బంకర్లను ధ్వంసం చేయడానికి ముందు.. చురచంద్‌పూర్‌లోని ఆ గ్రామాల్లో సైనిక హెలికాప్టర్‌తో వైమానిక పెట్రోలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఎలాంటి ఆకస్మిక పరిస్థితులు తలెత్తినా స్పందించేందుకు తాము రెడీ అని మణిపూర్ పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. గత సంవత్సరం మే నుంచి మణిపూర్‌లో జరిగిన జాతి హింసలో 200 మందికిపైగా చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కాగా, మణిపూర్‌లోని బిష్ణుపూర్, ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గగనతలంపై ఉగ్రవాదుల డ్రోన్లు కనిపించాయని ప్రజలు భద్రతా బలగాలకు సమాచారాన్ని అందించారు. దీంతో ఆయా ఏరియాల్లో భద్రతా బలగాలు అలర్ట్‌లో ఉన్నాయి.