Taj Mahal Camouflage : భారత్ – పాక్ ఘర్షణ.. తాజ్‌మహల్‌పై ‘గ్రీన్ కాముఫ్లేజ్’.. ఎందుకు ?
1971 భారత్ -పాక్ యుద్ధం జరిగినప్పుడు.. తాజ్ మహల్ భద్రత కోసం భారత సైన్యం 'కాముఫ్లేజ్' (Taj Mahal Camouflage) వ్యూహాన్ని అమలు చేసింది.
- By Pasha Published Date - 11:35 AM, Wed - 30 April 25

Taj Mahal Camouflage : ప్రస్తుతం భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా పాక్‌పై భారత్ దాడి చేసే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే పాకిస్తాన్ కూడా ప్రతిదాడితో స్పందించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అందరి చూపు.. భారతదేశానికి గర్వ కారణమైన తాజ్ మహల్ వైపు మళ్లింది. తాజ్ మహల్ భద్రతపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని భారత ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. 1942లో రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో, 1971లో భారత్ – పాకిస్తాన్ యుద్ధం జరిగిన సమయంలోనూ తాజ్ మహల్ భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. శత్రుదేశం యుద్ధ విమానాలు, రాడార్లకు తాజ్ మహల్ కనిపించకుండా అప్పట్లో వివిధ రకాల ఏర్పాట్లు చేశారు.
Also Read :Maoist Top Leaders: ఏపీ – తెలంగాణ బార్డర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ?
‘కాముఫ్లేజ్’ వ్యూహం అమలు
1971 భారత్ -పాక్ యుద్ధం జరిగినప్పుడు.. తాజ్ మహల్ భద్రత కోసం భారత సైన్యం ‘గ్రీన్ కాముఫ్లేజ్’ (Taj Mahal Camouflage) వ్యూహాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా ఒక భారీ ఆకుపచ్చ రంగు వస్త్రంతో తాజ్ మహల్ మొత్తాన్ని కప్పేసింది. తద్వారా ఆకాశం నుంచి చూస్తే.. అది తెల్ల రంగులో కాకుండా పచ్చరంగులో ఒక గుట్టలా లేదా నివాస ప్రాంతంలా కనిపిస్తుంది. అప్పట్లో పాకిస్తాన్, భారత్ యుద్ధం జరుగుతున్న వేళ.. రాత్రి టైంలో తాజ్ మహల్ చుట్టూ ఉండే విద్యుత్ దీపాలను పూర్తిగా ఆపేశారు. చీకట్లో శత్రుదేశం విమానాలకు తాజ్ మహల్ కనిపించకుండా ఏర్పాట్లు చేశారు. తాజ్ మహల్ పహారా కోసం ప్రత్యేక సైనిక టీమ్‌లను ఆనాడు మోహరించారు. 1971 భారత్ -పాక్ యుద్ధం జరిగిన టైంలో తాజ్ మహల్‌తో పాటు చారిత్రక కట్టడాలైన ఢిల్లీలోని ఎర్రకోట, కుతుబ్ మినార్, రాజస్థాన్ లోని జైసల్మీర్ కోట వంటి నిర్మాణాల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Also Read :Kazipet Railway Route : సికింద్రాబాద్- కాజీపేట రైల్వే మార్గం.. గుడ్ న్యూస్
1942లో రెండో ప్రపంచ యుద్ధం వేళ..
ఇక 1942లో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సమయానికి మన భారతదేశం బ్రిటీషర్ల పాలనలో ఉంది. బ్రిటీష్ వాళ్లు కూడా తాజ్ మహల్ భద్రతకు ప్రయారిటీ ఇచ్చారు.జపాన్, జర్మనీలకు చెందిన యుద్ధ విమానాలు తాజ్ మహల్‌పై దాడి చేస్తాయని బ్రిటీష్ పాలకులు ఆందోళనకు గురయ్యారు. శత్రుదేశాల యుద్ధ విమానాలకు తాజ్ మహల్ కనిపించకుండా చేసేందుకు.. దాని గోపురం నలువైపులా వెదురుతో ప్రత్యేక రక్షణ కంచెను ఏర్పాటు చేశారు. తాజ్ మహల్ గోపురం కనిపించకుండా చేయడం ద్వారా శత్రుదేశాల యుద్ద విమానాలను తప్పుదోవ పట్టించే ప్రణాళికను ఆనాడు అమలు చేశారు.