BJP Win : లోక్‌సభ పోల్స్‌లో బీజేపీ బోణీ.. సూరత్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం
BJP Win : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. గుజరాత్‌లోని సూరత్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- By Pasha Published Date - 03:59 PM, Mon - 22 April 24

BJP Win : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. గుజరాత్‌లోని సూరత్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ సమర్పించిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు రెజెక్ట్ చేశారు. నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలపై ప్రపోజర్లుగా సంతకాలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఏప్రిల్ 21న జిల్లా ఎన్నికల అధికారి ఎదుట హాజరయ్యేందుకు నో చెప్పారు. ఆ నామినేషన్ పత్రాలపై తాము సంతకాలు చేయలేదని ముగ్గురు వ్యక్తులు తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రెజెక్ట్ అయింది. ఇక ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఇతర అభ్యర్థులు కూడా నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ముఖేష్ దలాల్ ఏకగ్రీవ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది.
We’re now on WhatsApp. Click to Join
ముఖేష్ దలాల్ ఈ విజయాన్ని(BJP Win) సాధించడంపై గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ చేతికి మొదటి విజయ కమలాన్ని అందించినందుకు ముఖేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్‌లో ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. రాష్ట్రంలో మొత్తం 26 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 24 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తోంది. భావ్‌నగర్, భరూచ్ స్థానాల్లో ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.