SpaDeX Mission : ఇవాళ రాత్రి ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’.. జంట శాటిలైట్లతో జబర్దస్త్ ఫీట్
పీఎస్‌ఎల్వీ -సీ60 రాకెట్ సహాయంతో రెండు శాటిలైట్ స్పేస్ క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి ప్రయోగించి.. స్పేస్ డాకింగ్(SpaDeX Mission) ప్రక్రియను ప్రదర్శించనున్నారు.
- Author : Pasha
Date : 30-12-2024 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
SpaDeX Mission : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇవాళ (డిసెంబరు 30న) రాత్రి 9 గంటల 58 నిమిషాలకు మరో కీలకమైన ప్రయోగాన్ని చేయబోతోంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. దీన్ని ‘స్పేడెక్స్ మిషన్’ అని పిలుస్తున్నారు. స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్‌పరిమెంట్. శాటిలైట్లతో కూడిన స్పేస్ క్రాఫ్టులను డాకింగ్ చేసే ప్రక్రియను, అన్‌డాకింగ్ చేసే ప్రక్రియను టెస్ట్ చేయడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.స్పేస్ డాకింగ్ అంటే అంతరిక్షంలో రెండు శాటిలైట్ స్పేస్ క్రాఫ్టులను ఒకదాని పక్కన మరోదాన్ని చేర్చి లింక్ చేసే ప్రక్రియ.
🌟 PSLV-C60/SPADEX Mission Update 🌟
Visualize SpaDeX in Action!
🎞️ Animation Alert:
Experience the marvel of in-space docking with this animation!🌐 Click here for more information: https://t.co/jQEnGi3ocF pic.twitter.com/djVUkqXWYS
— ISRO (@isro) December 27, 2024
Also Read :Ethiopia : ఇథియోపియాలో ఘోరం.. నదిలో పడిన ట్రక్కు.. 71 మంది మృతి
పీఎస్‌ఎల్వీ -సీ60 రాకెట్ సహాయంతో రెండు శాటిలైట్ స్పేస్ క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి ప్రయోగించి.. స్పేస్ డాకింగ్(SpaDeX Mission) ప్రక్రియను ప్రదర్శించనున్నారు. భూమి నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ ప్రయోగమంతా జరుగుతుంది. ఇందుకోసం వినియోగించనున్న ఒక్కో శాటిలైట్ స్పేస్ క్రాఫ్ట్ బరువు 220 కిలోలు. ఇవి రెండు కూడా చిన్న సైజు శాటిలైట్‌లే. వీటిలో ఒక శాటిలైట్ పేరు ఛేజర్ (SDX01). మరో శాటిలైట్ పేరు టార్గెట్ (SDX02). ఈ రెండు శాటిలైట్ స్పేస్ క్రాఫ్టులను అంతరిక్షంలో డాక్ (అనుసంధానం) చేయడం.. డాక్ అయిన తర్వాత వాటి మధ్య ఇంధన పంపిణీ జరిగేలా చేయడం అనేది తొలి ఘటం. రెండో ఘట్టంలో భాగంగా ఆ రెండు శాటిలైట్ స్పేస్ క్రాఫ్టులను అన్‌డాక్ (విడదీయడం/వేరు చేయడం) చేస్తారు. అన్ డాక్ అయ్యాక వాటిని భూమి నుంచి మానిటర్ చేస్తూ ఆపరేట్ చేస్తారు. స్పేడెక్స్ మిషన్‌లో ప్రయోగిస్తున్న రెండు శాటిలైట్లు గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి. అంత వేగంతో కదిలే శాటిలైట్లను కంట్రోల్‌లోకి తీసుకొని ఇస్రో డాకింగ్ చేయించనుంది. ఇది సవాల్‌తో కూడుకున్న అంశమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read :Allu Arjun : అల్లు అర్జున్‌కు చుక్కెదురు.. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
స్పేస్ డాకింగ్, అన్ డాకింగ్ కోసం ఇస్రో చాలా చౌకైన టెక్నాలజీని తయారు చేసింది. ఇది ఒకవేళ సక్సెస్ అయితే.. భారతదేశం చేపట్టిన భారత అంతరిక్ష కేంద్ర ప్రాజెక్టుకు బలం చేకూరుతుంది. భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. చంద్రయాన్-4 ప్రాజెక్టుకు, గగన్ యాన్ మిషన్‌లకు కూడా ఈ సాంకేతిక చేదోడుగా నిలుస్తుంది. స్పేడెక్స్ మిషన్ సక్సెస్ అయితే ఈ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఇప్పటిదాకా విజయం సాధించాయి.