Shankaracharya : సాధువులను ఎవరూ కించపర్చలేరు.. చేసే పనుల వల్లే వారికి గౌరవం : జడ్జీ
ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద కోర్టుకెక్కారు.
- Author : Pasha
Date : 13-08-2024 - 4:36 IST
Published By : Hashtagu Telugu Desk
Shankaracharya : ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద కోర్టుకెక్కారు. తనను దొంగబాబాగా అభివర్ణించిన శివానంద యోగ విద్యాపీఠం వ్యవస్థాపకులు స్వామి గోవిందానంద సరస్వతిపై పరువు నష్టం దావా వేశారు. దీంతో ఈ ఇద్దరు స్వామీజీల మధ్య వివాదం ముదిరింది. ఈ పిటిషన్‌పై వెంటనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. స్వామి గోవిందానంద సరస్వతికి నోటీసులు జారీ చేసిన కోర్టు.. దీనికి సంబంధించిన విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది.
We’re now on WhatsApp. Click to Join
ఇవాళ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద(Shankaracharya) పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది మంచి పద్దతి కాదు. ఆయన(అవిముక్తేశ్వరానంద) కొంచెం ఆవేశానికిలోనై ఉంటారు. దీనిలో పరువు నష్టం ఉందని అనుకోం’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘‘మీరొక (అవిముక్తేశ్వరానంద) సాధువు. ఈ విషయంపై ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నారు. మీలాంటి వారు వీటిని పట్టించుకోకూడదు. ఇలాంటి వాటితో మిమ్మల్ని కించపర్చలేరు. సాధువులు తమ పనులతోనే గౌరవాన్ని పొందుతారు’’ అని జడ్జీ కామెంట్ చేశారు.
Also Read :Rajasthan Shocker : అమానుషం.. భార్యను బైక్‌కు కట్టేసి ఈడ్చుకెళ్లిన రాక్షస భర్త
అంతకుముందు కోర్టులో స్వామి అవిముక్తేశ్వరానంద తరఫు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. తన క్లయింట్‌ను స్వామి గోవిందానంద ‘దొంగ బాబా’ అన్నారని తెలిపారు. ‘‘హిస్టరీ షీటర్ అని.. రూ.7,000 కోట్ల బంగారాన్ని దొంగిలించారని.. సాధ్వీలతో సంబంధాలు పెట్టుకున్నారని.. క్రిమినల్ కేసులు ఉన్నాయని స్వామి గోవిందానంద నా క్లయింట్‌పై జులై 21న ఆరోపణలు చేశారు’’ అని స్వామి అవిముక్తేశ్వరానంద తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు ఈ దశలో ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
Also Read :Ramdev Baba : యాడ్స్ వివాదం..రామ్‌దేవ్ బాబాకు సుప్రీంకోర్టులో ఊరట
మరోవైపు స్వామి అవిముక్తేశ్వరానంద ఇటీవల కాలంలో పలు సంచలన ఆరోపణలు చేశారు. కేదార్‌నాథ్ ఆలయంలో 225 కిలోల బంగారం మాయమైందని ఆయన ఆరోపించారు. అయోధ్య రామాలయంలో జరిగిన కార్యక్రమంలో లోపాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో స్వామి అవిముక్తేశ్వరానందను సినీనటి కంగనా రనౌత్ సహా పలువురు విమర్శించారు. వీరిలో గోవిందానంద సరస్వతి కూడా ఉన్నారు.