RSS Chief : దళితులు, అట్టడుగు వర్గాలను హిందువులు కలుపుకుపోవాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్
వాల్మీకి జయంతిని వాల్మీకి కాలనీల్లో మాత్రమే ఎందుకు జరుపుకుంటారు?’’ అని మోహన్ భగవత్ (RSS Chief) ఈసందర్భంగా ప్రశ్నించారు.
- Author : Pasha
Date : 13-10-2024 - 12:16 IST
Published By : Hashtagu Telugu Desk
RSS Chief : “హిందూ సమాజం” కుల విభజనలను అధిగమించి దళితులు, అట్టడుగు వర్గాలను కలుపుకుపోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కోరారు. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా దేవాలయాలు, తాగునీటి సౌకర్యాలు, శ్మశానవాటికలలో సమ్మిళిత వాతావరణం అవసరమని ఆయన పేర్కొన్నారు. ‘‘హిందూ సమాజంలో ప్రస్తుతమున్న అంతరాలు మన సాధువులను, దేవతలను కూడా విభజించే స్థాయికి చేరుకుంది. వాల్మీకి జయంతిని వాల్మీకి కాలనీల్లో మాత్రమే ఎందుకు జరుపుకుంటారు?’’ అని మోహన్ భగవత్ (RSS Chief) ఈసందర్భంగా ప్రశ్నించారు.
‘‘రామాయణాన్ని వాల్మీకి మొత్తం హిందూ సమాజం కోసం రచించారు. కాబట్టి అందరూ కలిసి వాల్మీకి జయంతి, రవిదాస్ జయంతిని జరుపుకోవాలి. అన్ని పండుగలను హిందూ సమాజం కలిసికట్టుగా జరుపుకోవాలి. మేం ఈ సందేశాన్ని హిందూ సమాజంలోకి తీసుకెళ్తాం’’ అని మోహన్ భగవత్ తెలిపారు. నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది సామాజిక సామరస్యం. వివిధ వర్గాల మధ్య పరస్పర సద్భావన ఉండాలి. భాషలు, సంస్కృతులు, వంటకాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. వ్యక్తులు, కుటుంబాల మధ్య సామరస్యం తప్పకుండా ఉండాలి’’ అని మోహన్ భగవత్ చెప్పారు. వాల్మీకి ప్రతినిధులతో జరిగిన సమావేశంలో తాను ఈ అంశాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ‘‘ఒక చోట రాజ్‌పుత్ కమ్యూనిటీ సభ్యులు వాల్మీకి కాలనీకి చెందిన కొందరు విద్యార్థులను సమీపంలోని పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఇలాంటి సహకార భావన అవసరం’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ తెలిపారు. దేశంలో వర్గ విభేదాలను క్రియేట్ చేసేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్రలు పన్నుతున్నాయని.. వాటి కుట్రలను భగ్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.