Devaragattu Stick Fight : దేవరగట్టు కర్రల సమరం రక్తసిక్తం..100 మందికిపైగా గాయాలపాలు
ప్రజల ప్రాణాలపైకి(Devaragattu Stick Fight) వస్తుందని తెలిసినా.. ఇలాంటి ఉత్సవాల నిర్వహణకు అనుమతులు ఇస్తుండటంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
- By Pasha Published Date - 10:31 AM, Sun - 13 October 24

Devaragattu Stick Fight : దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన కర్రల సమరం మరోసారి రక్తసిక్తమైంది. మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు ఆదివారం తెల్లవారుజామున జరిగిన కర్రల సమరంలో దాదాపు 100 మందికిపైగా గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. వారిలో 21 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. క్షతగాత్రులకు ఆదోని, బళ్లారి ఆస్పత్రులలో చికిత్స జరుగుతున్నట్లు సమాచారం. ప్రజల ప్రాణాలపైకి(Devaragattu Stick Fight) వస్తుందని తెలిసినా.. ఇలాంటి ఉత్సవాలను నిర్వహిస్తుండటంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ కర్రల సమరాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో జనం దేవరగట్టుకు చేరుకోవడం గమనార్హం.
Also Read :Professor Saibaba : ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు.. ఆయనను పదేళ్లు జైలులో ఎందుకు ఉంచారు ?
- దేవరగట్టులో దాదాపు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి వెలిశారు.
- మాళ మల్లేశ్వరస్వామి, దేవతా మూర్తులను కాపాడుకోడానికి నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులతో అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు కర్రలతో హోరాహోరీగా తలపడ్డారు.
- ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజామున పెద్దసంఖ్యలో భక్తులు గాయపడ్డారు.
- చిన్నపాటి గాయాలైన వారు పసుపు రాసుకొని వెళ్లిపోయారు.
త్రేతా యుగంలో ఏం జరిగిందంటే..
త్రేతాయుగంలో దేవరగట్టు కొండల్లో మునులు యజ్ఞ యాగాలు నిర్వహించేవారని నమ్ముతారు. ఆ యజ్ఞ యాగాలను మణి, మల్లాసురుడు అనే రాక్షసులు భగ్నం చేసేవారట. దీంతో విసిగిపోయిన మునులు శివపార్వతులను వేడుకుంటే, ఆదిదంపతులు మాళ, మల్లేశ్వరులుగా అవతరించారని విశ్వసిస్తారు. అప్పటి నుంచి విజయదశమి నాడు జైత్రయాత్ర జరుగుతోంది. ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతామని ఆయా గ్రామాల భక్తులు తొలుత ప్రతిజ్ఞ చేసి బయలుదేరుతారు. ఆ వెంటనే కొండపైకి వెళ్లి స్వామి వారి కల్యాణోత్సవానికి అనుమతి తీసుకుంటారు. అక్కడ మాళ మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం నిర్వహించి, స్వామి పల్లకిని 350 మెట్లు దిగి కల్యాణకట్ట దగ్గరకు తీసుకొస్తారు. అక్కడి నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లే టైంలో కర్రలతో తలపడతారు. అనంతరం ఉత్సవ మూర్తులు బసవన్నగుడికి చేరతాయి. ఆలయ పూజారి భవిష్య వాణి వినిపించిన తర్వాత మళ్లీ కర్రల సమరం జరుగుతుంది. చివరకు ఉత్సవమూర్తులను కల్యాణకట్టకు చేర్చడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది.