Crorepati Constable : ‘‘రూ.500 కోట్ల మాజీ కానిస్టేబుల్’’ మిస్సింగ్.. అతడి డైరీపై రాజకీయ రచ్చ
‘‘సౌరభ్ శర్మ(Crorepati Constable) డైరీలో మొత్తం 66 పేజీలు ఉన్నాయి.
- By Pasha Published Date - 07:29 PM, Wed - 15 January 25

Crorepati Constable : సౌరభ్ శర్మ.. మధ్యప్రదేశ్‌లోని రవాణా శాఖలో మాజీ కానిస్టేబుల్. ఆయన నివాసాల్లో నెల క్రితం రైడ్స్ చేసిన లోకాయుక్త పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే ఏకంగా రూ.500 కోట్లకుపైగా విలువ చేసే ఆస్తులు ఆయనకు ఉన్నాయని గుర్తించారు. ఇందులో రూ.11 కోట్ల నగదు, 52 కేజీల బంగారం, స్థిరాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రైడ్స్ జరిగినప్పటి నుంచి సౌరభ్ శర్మ కనిపించకుండా పోయారు. ఆయనకు చెందిన డైరీపై ఇప్పుడు రాజకీయ కలకలం రేగుతోంది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలను క్రియేట్ చేయగల కీలక సమాచారం అందులో ఉందనే టాక్ వినిపిస్తోంది. అధికార బీజేపీ చిట్టాయే ఆ డైరీలో ఉందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
Also Read :Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఖలిస్తానీ మూకల ముప్పు.. ఆప్ అధినేత రియాక్షన్ ఇదీ
‘‘సౌరభ్ శర్మ(Crorepati Constable) డైరీలో మొత్తం 66 పేజీలు ఉన్నాయి. అందులో 6 పేజీలకు సంబంధించిన సమాచారం నా దగ్గరుంది. మధ్యప్రదేశ్‌లోని వివిధ చెక్ పోస్టుల వద్ద జరిగిన దాదాపు రూ.1,300 కోట్ల అక్రమ వసూళ్ల చిట్టా అందులో ఉంది’’ అని మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ఆరోపించారు. ఇదంతా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతి కార్యమేనని ఆయన విమర్శించారు. ‘‘సౌరభ్ నివాసాలపై లోకాయుక్త పోలీసులు, ఆదాయపు పన్ను విభాగం, ఈడీ విభాగాలు సంయుక్తంగా దాడులు చేశాయి. ఇప్పుడు దానిపై దర్యాప్తు ఆగినట్టుగా కనిపిస్తోంది. సౌరభ్ డైరీలోని ఆరు పేజీలలో ఉన్న సమాచారాన్ని బాధ్యత వహించేందుకు ఎవరూ సిద్ధంగా కనిపించడం లేదు’’ అని జితూ పట్వారీ కామెంట్ చేశారు.
Also Read :Kanuma Offer : ఇంటింటికీ ఫ్రీగా మటన్..ఎక్కడంటే ..!!
తమకు అందించిన సమాచారం సౌరభ్ ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. సౌరభ్‌కు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ‘‘సౌరభ్‌కు చెందిన డైరీలో ‘TC’, ‘TM’ అనే పదాలు ఉన్నాయి. ‘TC’ అంటే ట్రాన్స్ పోర్ట్ కమిషనర్, ‘TM’ అంటే ట్రాన్స్‌పోర్ట్ మంత్రి అనే అర్థాలు వస్తాయి కదా’’ అని జితూ పట్వారీ ప్రశ్నించారు. ఈ ఆరోపణలను మధ్యప్రదేశ్ బీజేపీ మీడియా ఇన్‌ఛార్జి ఆశిష్ అగర్వాల్ ఖండించారు. కమల్ నాథ్ సారథ్యంలో 15 నెలల పాటు మధ్యప్రదేశ్‌లో నడిచిన రాష్ట్ర సర్కారు గురించి కాంగ్రెస్ ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. సౌరభ్ శర్మ కేసుతో కాంగ్రెస్‌కు ఉన్న లింకులు బయటపడతాయని జితూ పట్వారీ భయపడుతున్నట్టుగా కనిపిస్తోందని ఆశిష్ అగర్వాల్ పేర్కొన్నారు. కేవలం వార్తల్లోకి ఎక్కాలని జితూ పట్వారీ పాకులాడుతున్నారని చెప్పారు.